వన్డే సిరీస్ పూర్తి కావడానికి ఇంకా మూడు మ్యాచ్‌లు ఉన్నాయి. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో భారత బ్యాట్సమెన్‌ల విశ్వరూపం న్యూజిలాండ్ జట్టు ఇంకా చూడనేలేదు. అప్పుడే భారత ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అంటే న్యూజిలాండ్ బౌలర్లు భయపడుతున్నారు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ కెప్టెన్ డేనియల్ వెటోరీ స్వయంగా అంగీకరించాడు.
వెల్లింగ్టన్‌లో విలేకరులతో వెటోరీ మాట్లాడుతూ, సెహ్వాగ్ అంటే తమ బౌలర్లు భయపడుతున్నారని తెలిపాడు. తాము పగడ్బంధీగా చేసే ప్రణాళికలన్నింటినీ తుత్తునియలు చేసేస్తున్నాడని వాపోయాడు. రెండో వన్డే మ్యాచ్‌లో కేవలం సెహ్వాగ్ 26 బంతుల్లో అభేధ్యమైన 54 పరుగులు చేయడాన్ని ఇందుకు నిదర్శనంగా చెప్పాడు.
ఆరంభంలోనే సచిన్, సెహ్వాగ్‌ల వికెట్లు తీయడం ద్వారా మిగిలిన భారత బ్యాట్సమెన్‌లపై ఒత్తిడి పెంచాలనుకున్నామని... అయితే సెహ్వాగ్ వాటిని పటాపంచలు చేశాడని వివరించాడు. అతనొక గొప్ప ఆటగాడని ప్రశంసల జల్లులు కురిపించాడు.
తమ బౌలర్లు భయపడుతున్నారని తాను చెప్పలేను, కానీ ఒకింత కలవరపాటుకు గురి అవుతున్నారన్న విషయాన్ని తాను అర్థం చేసుకున్నానన్నాడు. ఇక ముందు జరగబోయే మ్యాచ్ నుంచి సెహ్వాగ్‌పైనే తాము దృష్టి సారించనున్నట్లు వ్యాఖ్యానించాడు.