సచిన్ రాకతో జట్టుకు నైతిక బలం : ధోనీ

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రాకతో మంగళవారం ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌లో... జట్టుకు నైతిక బలం పెరుగుతుందని టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. సచిన్ రాక జట్టుకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని ఆయన చెప్పాడు. కాగా, ఇటీవల ఆతిథ్య దేశంతో జరిగిన రెండు ట్వంటీ20 మ్యాచ్‌ల్లోనూ టీం ఇండియా అపజయం పాలయిన సంగతి విదితమే.

ఈ నేపథ్యంలో మంగళవారం టీం ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం అవనుంది. ఈ మేరకు ధోనీ మాట్లాడుతూ.. సీనియర్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ రాకతో, జట్టుకు నైతిక బలం బాగా పెరుగుతుందని కొండంత ఆత్మవిశ్వాసంతో చెప్పాడు.

అతనొక గొప్ప బ్యాట్స్‌మెన్ అనీ.. బ్యాటింగ్, బౌలింగ్ పరంగానే కాకుండా.. ఆయన గడించిన అనుభవం ప్రస్తుత పరిస్థితుల్లో జట్టుకు ఎంతో ఉపయోగకరమని ధోనీ వ్యాఖ్యానించాడు. లిటిల్ మాస్టర్ డ్రస్సింగ్ రూం వాతావరణాన్ని కూడా పూర్తిగా మార్చివేస్తాడనీ సంతోషం వ్యక్తం చేశాడు.

సచిన్ ఉండటం జట్టుపై, ప్రత్యర్థులపై ఎంత ప్రభావం చూపుతుందో తాను పరిమాణంలో చెప్పలేనని ధోనీ పేర్కొన్నాడు. దీనికి సమాధానం చెప్పడం అనేది చాలా కష్టసాధ్యమైన విషమని, అతని విషయంలో ప్రత్యర్థులు జాగ్రత్త పడాల్సిన అంశాలు బోలెడుంటాయని టీం ఇండియా సారథి వివరించాడు.

వెబ్దునియా పై చదవండి