వాస్తు శాస్త్రాల్లో అత్యంత ప్రాచుర్యం పొందినవాటిలో చైనా వాస్తు శాస్త్రం ఫెంగ్‌షుయ్ ఒకటి. ఈ ఫెంగ్‌షుయ్ వాస్తును మన దేశంలోనూ అనుసరిస్తున్నారు. దీనిని అనుసరించి ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. ఇల్లు నిర్మించేటపుడు ఒక్కో గదికి ప్రత్యేకమైన నిర్మాణ విధానాన్ని అనుసరించాలంటున్నది ఫెంగ్‌షుయ్. అంతేకాదు ఆ గదులలో వాతావరణం, వస్తువుల అమరిక గురించి వివరంగా తెలియజేసింది. ఉదాహరణకు బెడ్రూమ్‌లో అమరిక ఎలా ఉండాలన్న విషయాన్ని ఒకసారి తెలుసుకుందాం...
బెడ్‌ను బెడ్రూం తలుపుకి ఎదురుగా ఉండేటట్లు వేయకూడదు. అదేవిధంగా కిటికీలకు ఎదురుగా బెడ్ ఉండకూడదు. డ్రెస్సింగ్ టేబుల్, అద్దం వంటివాటిని తలవైపు, కాళ్ల వైపు ఉండేటట్లు వేయకూడదు. బెడ్ వెనుక గోడ మాత్రమే ఉండేలా అమర్చాలి.
కారణమేమంటే... కిటికీ తలుపులు నుంచి చైనా వాస్తు పిలిచే "చి" ప్రవాహం బయటకు వెళుతుంది. ఇలా బయటకు వెళ్లే 'చి' ప్రవాహాన్ని అడ్డుకోవటం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయని ఫెంగ్ షుయ్ చెపుతోంది.