కార్తీకంలో సూర్యోదయానికి ముందు దీపాలు వెలిగిస్తే ఫలితం ఏమిటి?

గురువారం, 19 నవంబరు 2015 (17:16 IST)
కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే దీపాలు వెలిగించే సంప్రదాయం వెనుకా ఓ మహత్తర సత్యం ఉంది. దీపం.. ఆశావాదానికి ప్రతీక. అజ్ఞానాన్ని చీకటితో, జ్ఞానాన్ని వెలుతురుతో పోలుస్తారు. మనలోని నిరాశ, అజ్ఞానం, అహంకారం మటుమాయమై జ్ఞానకాంతి ప్రవహించాలని దీపారాధన చేస్తున్నప్పుడు సంకల్పించుకోవాలి. చెట్లుపుట్టలు పశుపక్ష్యాదుల్లోని సర్వవ్యాపకుడైన భగవానుడిని చూడటం ఉత్తమ సంస్కారం. కార్తీకంలోని తులసి కల్యాణాలు, గోపూజలు ఇదే సత్యాన్ని చాటుతాయి. 
 
కార్తీక క్షీరాబ్ధి ద్వాదశి రోజున తులసీ కల్యాణం ఘనంగా జరుపుతారు. పాడ్యమినాడు గోపూజ చేస్తారు. కాలభైరవాష్టమి నాడు, విశ్వాసానికి మారుపేరైన శునకాలకు కడుపునిండా ఆహారం పెడతారు. పుష్కలమైన పోషకవిలువల్ని అందించే ఉసిరి... కార్తిక ఫలరాజం. పూజ పేరుతోనూ వ్రతం పేరుతోనూ ఉసిరిని చేతులెత్తి మొక్కుతారు. దామోదర మాసమైన కార్తీక మాసంలో తులసీకోటలో విష్ణుమూర్తి ఉంటాడని, సూర్యోదయానికి ముందు చేసే పూజలన్నీ దామోదరుడికి, సూర్యోదయానికి తర్వాత చేసే పూజలు శివుడికి చేరుతాయని పండితులు అంటున్నారు. 
 
ఇక సూర్యోదయానికి ముందే మేల్కొనడం, చన్నీటితో స్నానం చేయడం, ఏ విష్ణు సహస్రనామమో శివ పురాణమో చదువుకోవడం...ఇలా కార్తిక మాసంలో దినచర్య ఓ రెండుమూడు గంటలు ముందుగానే ప్రారంభించాలి. చన్నీటి స్నానంతో శరీర ఉష్ణోగ్రత క్రమబద్ధం అవుతుందని ఆయుర్వేదం కూడా చెప్తుంది. కార్తీక నెలంతా తులసీ పూజ చేయాలి. చల్లదనం నుంచి వచ్చే రోగాల నుంచి తప్పించుకోవడానికి తులసీ పూజ చేయాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
 
తులసీ కోటలో ఓ రాయి వుంటుంది.  ఆ రాయి ఎందుకు వుండాలంటే.. తులసీ విష్ణువును రాయై పోమ్మని శపించినందుకు సంకేతంగా ఆ రాయి వుంటుంది. తులసీ కోట, మట్టి, చెట్టు దీపం ఉన్నప్పటికీ కోట కింద ఓ రాయి వుంటుంది. ఆ రాయి విష్ణువేనని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. కార్తీక మాసంలో శివకేశవులకు ప్రాధాన్యత ఇస్తుందని.. ఈ మాసంలో చేసే పూజలు శివకేశవులకు వర్తిస్తాయని వారు చెప్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి