దక్షిణాసియాలో నెలకొన్న అన్ని సమస్యలకు కాశ్మీర్ వివాదమే ప్రధాన కారణమని, అందువల్ల దీన్ని పరిష్కరించాలని పాకిస్థాన్ మరోమారు ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేసింది. సమితి జనరల్ అసెంబ్లీ వలస విముక్తిపై ఇటీవల భేటీ అయింది. ఇందులో పాకిస్థాన్ శాశ్వత ఉప ప్రతినిధి అజ్మద్ హుస్సేన్ బి సియాల్ ప్రసంగిస్తూ కాశ్మీర్ సమస్యను మరోమారు లేవనెత్తారు. కాశ్మీర్ సమస్యను పరిష్కరించక పోతే ఐరాస వలస విముక్తి అజెండా అసంపూర్తిగా ముగుస్తుందన్నారు.
కాశ్మీర్ ప్రజలకు స్వతంత్ర గుర్తింపు ఇవ్వాలని, ఇందుకోసం అంతర్జాతీయ సమాజం మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఒకవేళ కాశ్మీర్ ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఇవ్వక పోతే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్నారు. ఈ పరిస్థితులకు దక్షిణాసియా, పశ్చిమాసియా సాక్ష్యాలుగా నిలవడం దురదృష్టకరమన్నారు.
అందువల్ల కాశ్మీర్ సమస్య పరిష్కారానికి ఐరాస ప్రత్యేక చొరవ చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే, దీనిపై భారత్ ఘాటుగానే స్పందించింది. కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని మనదేశ సీనియర్ దౌత్యవేత్త అనుపమ్ రారు తేల్చి చెప్పారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో కాశ్మీర్ భారత్‌లో విలీనమైందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు.