తమపై జరుగుతున్న జాతి వివక్ష దాడులను ఆపాలని కోరుతూ ఆస్ట్రేలియాలోని భారత విద్యార్ధులు సాగిస్తున్న ఆందోళనలకు బ్రేక్ పడింది. ఇప్పటివరకు తాము సాగించిన ఆందోళన కార్యక్రమాలు చక్కని ఫలితాన్ని ఇచ్చిన కారణంగా వారు తమ ఆందోళనను విరమించుకున్నారు.
ఈ విషయమై భారత దౌత్య కార్యాలయాధికారి ఏర్పాటు చేసిన భారత జాతీయుల కమిటీ సమన్వయకర్త యదూసింగ్ గురువారం మాట్లాడుతూ పై విషయాన్ని దృవీకరించారు. విద్యార్ధులు సాగించిన ఆందోళన, నిరసన కార్యక్రమాలు ఫలితాన్ని ఇచ్చాయని కాబట్టి ఇకముందు నిరసన కార్యక్రమాలు అవసరం లేదని స్థానిక భారత జాతి నాయకులు విద్యార్ధులకు విజ్ఞప్తి చేసినట్టు ఆయన తెలిపారు.
ఈ విజ్ఞప్తి మేరకు భారతీయ విద్యార్ధులు ఆందోళన విరమించేందుకు నిర్ణయించారని ఆయన తెలిపారు. అదేసమయంలో విద్యార్ధులు నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమాలు స్థానిక ప్రజలకు ఇబ్బందికరంగా మారుతోందని, సాధారణ పరిస్థితులకు భంగం కలుగుతోందని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ కారణాలవల్లే ఆందేళన విరమించాల్సిందిగా స్థానిక భారత నేతలు విద్యార్ధులను కోరారని ఆయన వివరించారు.