ఉగ్రవాదుల చెరలో 25 బందీలు: కాపాడిన కమాండోలు

పాకిస్థాన్‌లోని రావిల్పిండిలగల ఆర్మీ జనరల్ హెడ్‌క్వార్టర్స్‌‌కు సమీపంలోని ఓ భవంతిలో నిర్బంధించబడిన 25 మంది బందీలను ఉగ్రవాదుల మూక చెర నుంచి పాక్ ఆర్మీ కమాండోలు విడిపించారు. పాక్ కమాండోలు చేపట్టిన ఈ ఆపరేషన్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు చీఫ్ మిలిటరీ ప్రతినిధి వెల్లడించారు.

నిన్న పాక్ ఆర్మీ జనరల్ హెడ్‌క్వార్టర్స్‌పై ఈ ఉగ్రవాదుల మూక దాడి జరిపిన సంగతి విదితమే. ఈ దాడి సమయంలో హెడ్‌క్వార్టర్స్‌లో 25 మంది భద్రతా సిబ్బందిని ఈ ఉగ్రవాదుల మూక నిర్బంధించింది. వీరిని విడిపించడం కోసం.. సుమారు 20 గంటల సుదీర్ఘ ఆపరేషన్‌కు పాక్ ఆర్మీ ప్రణాళిక చేసింది.

ఈ ఆపరేషన్‌లో ఉగ్రవాదుల చెర నుంచి బందీలను విడిపించిన అనంతరం.. ఆ ప్రాంతంలో ఇంకా ఉగ్రవాదులెవరైనా ఉంటారనే ఉద్ధేశ్యంతో కమాండోలు శోధిస్తున్నారని మిలిటరీ ప్రతినిధి మేజర్ జనరల్ అతార్ అబ్బాస్ తెలిపారు. అయితే ఈ ఆపరేషన్‌లో మృతి చెందిన వారి వివరాలేవీ ఆయన వెల్లడించలేదు.

కాగా, ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఉగ్రవాదుల చెరలోని బందీలను పాక్ కమాండోలు విడిపించారు. కమాండోలు ఆపరేషన్ చేపట్టిన అనంతరం అనేక బాంబు పేలుళ్ల శబ్ధాలు వినిపించాయి. నిన్న సాయంత్రం కమాండోలు ఈ ఆపరేషన్‌ను ప్రారంభించారు.

వెబ్దునియా పై చదవండి