ఉచిత విద్య కోసం విద్యార్థుల పోరు: పోలీసుల అణిచివేత!

శుక్రవారం, 12 ఆగస్టు 2011 (10:02 IST)
ప్రభుత్వ విద్యావ్యవస్థలో మార్పులు చేసి ఉచిత విద్యను అందించాలని కోరుతూ డిమాండ్ చేసిన విద్యార్థులపై చిలీ పోలీసులు తమ జులుం ప్రదర్శించారు. ఆ దేశ రాజధాని శాంటియాగోకు 120 కిలోమీటర్ల దూరంలోని వల్పరాసియోలో విద్యార్థులు జరిపిన ప్రదర్శన హింసాత్మకరూపం దాల్చింది.

భద్రతా దళాలపై ఆందోళనకారులు పెద్ద ఎత్తున రాళ్లు రువ్వారు. చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినెరాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దాదాపు 396 మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘర్షణల్లో 55 మంది పోలీసు అధికారులు, 23 మంది పౌరులు గాయపడ్డారు.

నాణ్యమైన ఉచిత విద్యను అందించాలని విద్యార్థులు, డిమాండ్ చేస్తున్నారు. 1990లో సైనిక నియంత అగస్టో పినోచెట్ పాలన అంతమైన తర్వాత ఇంతటి పెద్ద నిరసన ప్రదర్శనలు జరగడం ఇదే ప్రథమం. ఒక్క శాంటియాగోలోనే దాదాపు లక్ష మంది ఆందోళనల్లో పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి