ఉల్ఫా నాయకుడిని భారత్‌కు అప్పగించనున్న బంగ్లా

బంగ్లాదేశ్ తమ దేశంలో నిర్భంధించిన యునైటెడ్ లిబరేషన్ ఆఫ్ అసోమ్(ఉల్ఫా) నాయకుడు అనూప్ ఛేతియాను భారత్‌కు అప్పగించనున్నట్లు బుధవారం వెల్లడించింది. భారత్‌కు అప్పగించే విషయంలో న్యాయపరమైన అంశాలన్నింటినీ పరిశీలించినట్లు బంగ్లా హోం మంత్రి సహారా ఖతున్ తెలిపారు.

1997లో బంగ్లాదేశ్‌లో అరెస్ట్ అయిన ఉల్ఫా ప్రధాన కార్యదర్శి అనూప్ ఛేతియా జైలు శిక్ష ముగిసిన అనంతరం నిర్భంధంలో వున్నాడు. ఉల్ఫా భారత్‌లోని అస్సాం రాష్ట్రం స్వతంత్ర దేశంగా అవతరించడానికి 1979 నుంచి పోరాడుతున్న ఉగ్రవాద సంస్థ. గత రెండు దశాబ్దాల్లో ఈ పోరాటంలో సుమారు పదివేల మంది ప్రాణాలు కోల్పోయారు.

భారత హోం మంత్రి పి. చిదంబరం ఇటీవల జరిపిన ఢాకా పర్యటన తర్వాత బంగ్లాదేశ్ ఛేతియాను అప్పగించడానికి ముందుకు కదిలింది. చిదంబరం పర్యటనలో బంగ్లాలో తలదాచుకుంటున్న యాభై మంది భారత నేరస్థుల జాబితాను భారత అధికారులు బంగ్లాదేశ్‌కు అందించారు. వారిని అప్పగించాలని భారత్ కోరింది.

భారత అధికారులు అందజేసిన జాబితాలో అనూప్ ఛేతియా టాప్‌లో ఉన్నట్లు బంగ్లా హోం కార్యదర్శి అబ్దుస్ సోభన్ సిక్దర్ పేర్కొన్నారు. ఇదే సమయంలో బంగ్లాదేశ్ కూడా వంద మంది తమ దేశ నేరస్తుల జాబితాను భారత్‌కు అందించింది.

వెబ్దునియా పై చదవండి