ఎయిర్‌ఫ్రాన్స్ ప్రమాదం: 17 మృతదేహాలు లభ్యం

అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయిన ఎయిర్ ఫ్రాన్స్ విమానంలో ప్రయాణించినవారిలో 17 మంది మృతదేహాలను బ్రెజిల్ అధికారిక యంత్రాంగం కనుగొంది. బ్రెజిల్ రాజధాని రియో డి జెనీరో నుంచి పారిస్ వెళుతూ వారం క్రితం అట్లాంటిక్ మహాసముద్రంలో ఎయిర్‌ఫ్రాన్స్ జెట్ విమానం కూలిపోయిన సంగతి తెలిసిందే. విమానంలోని 228 మంది ప్రయాణికులు ఈ ప్రమాదంలో మృతి చెందారు.

గత వారం రోజులగా కూలిపోయిన విమాన శకలాల కోసం రెండు దేశాల ప్రభుత్వాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. విమానం కూలిపోయిన ప్రదేశంలో సహాయక సిబ్బంది ఇప్పటివరకు 17 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే విమాన ప్రమాదానికి స్పీడోమీటర్ సరిగా పనిచేయపోవడం కారణమై ఉండవచ్చని దర్యాప్తు చేస్తున్న నిపుణులు అనుమానిస్తున్నారు.

ఈ దిశగా దర్యాప్తు చేపట్టారు. బ్రెజిల్ ఈశాన్య తీరానికి 1150 కిలోమీటర్ల దూరంలో సహాయక సిబ్బంది మరో 15 మృతదేహాలను కనుగొన్నారని బ్రెజిల్ అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు సిబ్బందికి ఇబ్బందికరంగా మారాయి. విమానంలోని సీట్లు, ఇతర విమాన శకలాలను కూడా గుర్తించినట్లు బ్రెజిల్ మిలిటరీ అధికారులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి