కాబూల్‌లో తీవ్రవాదుల దాడి: ఐఎస్ఐ హస్తం

ఆదివారం, 11 అక్టోబరు 2009 (12:11 IST)
ఆఫ్గనిస్థాన్ దేశ రాజధాని కాబూల్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయంపై ఇటీవల జరిగిన ఆత్మాహుతి దాడిపై పాకిస్థాన్ గూఢాచర్య సంస్థ (ఐఎస్ఐ) హస్తం ఉందని ఆఫ్గనిస్థాన్ ఆరోపించారు. ఇదే సందేహాన్ని కేంద్ర విదేశాంగ కార్యదర్శి నిరుపమారావు కూడా వ్యక్తం చేశారు. ఈ దాడి అనంతరం చేపట్టిన దర్యాప్తులో కీలక సాక్ష్యాలు లభ్యమయ్యాయని ఆఫ్గన్ అధికారులు తెలిపారు.

గతంలో జరిగిన దాడులకు, వీటికి పోలిక ఉన్నాయని అందువల్ల ఐఎస్ఐ హస్తం తప్పక ఉండివుంటుందని అమెరికాలోని ఆఫ్గన్ రాయబారి సైద్ జవాద్ ఆరోపించారు. దీనిపై ఆయన శనివారం మాట్లాడుతూ.. తమ దేశంలో శాంతి భద్రతలు నెలకొనాలని తమతో పాటు.. ప్రపంచ దేశాలన్నీ కృషి చేస్తున్నాయన్నారు.

దీన్ని పాక్ గూఢచర్య సంస్థ మాత్రం నీళ్లు చల్లుతోందని ఆయన ఆరోపించారు. గత యేడాది జులై నెలలో ఎంబసీపై జరిగిన దాడిలో వెనుక కూడా ఐఎస్ఐ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. ఇదిలావుండగా రెండు రోజుల పర్యటన అనంతరం స్వదేశానికి వచ్చిన విదేశాంగ కార్యదర్శి నిరుపమా రావు మాట్లాడుతూ.. భారత్-ఆఫ్గన్ సంబంధాలను దెబ్బతీసే శక్తులే ఈ దాడికి పాల్పడి ఉంటాయని ఆమె ఆరోపించారు.

ఇలాంటి చర్యలను భారత్ ఏమాత్రం ఖాతరు చేయబోదని, ఆఫ్గన్ ప్రజలకు సాయం చేయడంలోనూ, ద్వైపాక్షిక అభివృద్ధికి తోడ్పాటు అందించడంలోనూ ఒక దృఢమైన వైఖరితో ముందుకు సాగుతుందని నిపుపమా రావు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి