కుట్రదారులను చట్టం ముందు నిలబెడతాం: పాక్

గత ఏడాది ముంబయి మహానగర వాసులను భయకంపితులను చేసిన ఉగ్రవాద దాడుల కుట్రదారులను చట్టం ముందుకు తీసుకొచ్చేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం చేపట్టిన చర్యలపై అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో.. ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రెహమాన్ మాలిక్ మాట్లాడుతూ.. ముంబయి ఉగ్రవాద దాడుల కుట్రదారులను చట్టం ముందు నిలబెట్టేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

ముంబయి దాడుల ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న జాముదాత్ దవా చీఫ్ హఫీజ్ సయీద్‌ను ఇటీవల లాహోర్ హైకోర్టు గృహ నిర్బంధం నుంచి విడుదల చేసిన సంగతి తెలిసిందే. సయీద్ విడుదలను అడ్డుకునేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం సరైన ఆధారాలు సమర్పించకపోవడం వలనే లాహోర్ హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. భారత్ దీనిని తీవ్రంగా పరిగణించింది. ముంబయి దాడుల కుట్రదారులపై చర్యలు తీసుకోవడంలో పాకిస్థాన్ ప్రభుత్వ నిబద్ధతపై సందేహం వ్యక్తం చేసింది.

ఈ నేపథ్యంలో రెహమాన్ మాలిక్ మాట్లాడుతూ.. పాక్ ప్రభుత్వం ముంబయి దాడుల కుట్రదారులను చట్టం ముందుకు తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉందని, ఈ విషయంలో భారత్ సందేహించాల్సిన అవసరం లేదని ఉద్ఘాటించారు. సయీద్ విడుదల కావడంపై స్పందిస్తూ.. పాకిస్థాన్‌లో కోర్టు, న్యాయవ్యవస్థలు స్వతంత్రంగా పనిచేస్తాయన్నారు.

ఇదిలా ఉంటే ముంబయి దాడుల అనంతరం భారత్ నిలిపివేసిన ఇరుదేశాల శాంతి చర్చల ప్రక్రియను పునరుద్ధరించాలని మాలిక్ కోరారు. శాంతియుతమైన సరిహద్దు ఇరుదేశాల మధ్య వాణిజ్యాన్ని, ద్వైపాక్షిక సంబంధాలను మెరుగురుస్తుందని చెప్పారు. మాలిక్ శనివారం ఉదయం పాకిస్థాన్‌లో భారత దౌత్యాధికారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పైఅభిప్రాయాలు వెలిబుచ్చారు.

వెబ్దునియా పై చదవండి