టిబెట్ ప్రధానమంత్రిగా లోబ్సాంగ్ సాంగే ప్రమాణం చేయనున్నారు. సోమవారం ధర్మశాలలో జరిగే ఓ కార్యక్రమంలో చీఫ్ జస్టిస్ కమిషనర్ గవాంగ్ పెల్గ్యాల్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామాకు 43 ఏళ్ల సాంగే రాజకీయ వారసుడని చెబుతారు.
సమ్ధాంగ్ రిన్పోచే తర్వాత సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన మంత్రి (కలోన్ ట్రైపా)గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. డార్జిలింగ్‌లో జన్మించిన సాంగే ఢిల్లీలో విద్యాభ్యాసం చేశారు. అమెరికాలో ఉన్నత చదువులు పూర్తి చేసిన ఆయన.. హార్వర్డ్ లా స్కూల్లో సీనియర్ ఫెలోగా ఉన్న సమయంలో ప్రధానిగా ఎన్నిక కావడం గమనార్హం. ఈ ప్రమాణ స్వీకారానికి దలైలామా కూడా హాజరుకానున్నారు.