గత ఏడాది నవంబరులో జరిగిన ముంబయి ఉగ్రవాద దాడుల అనంతరం భారత్, పాకిస్థాన్‌ల మధ్య తొలిసారి అత్యున్నత స్థాయి చర్చలు జరగబోతున్నాయి. ఇరుదేశాల అధినేతలు రష్యా పర్యటనలో భాగంగా కలుసుకోబోతున్నారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మంగళవారం పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీని కలుసుకోనున్నారు.
ఈ సందర్భంగా తీవ్రవాదంపై పాకిస్థాన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల ప్రధాని మన్మోహన్ సింగ్ తమ అసంతృప్తిని వ్యక్తం చేసే అవకాశం ఉంది. రెండు అంతర్జాతీయ సదస్సులకు హాజరయ్యేందుకు మూడు రోజుల విదేశీ పర్యటన చేపట్టిన మన్మోహన్ సింగ్- పాక్ అధ్యక్షుడి మధ్య జరిగే సమావేశంలో తీవ్రవాదమే ప్రధానాంశం కానుంది.
పాకిస్థాన్ గడ్డపై తీవ్రవాద మౌలిక సదుపాయాలని ధ్వంసం చేసేందుకు ఆ దేశ ప్రభుత్వం నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలని మన్మోహన్ సింగ్ ఈ సందర్భంగా స్పష్టం చేయనున్నారు. రష్యాలో జరిగే షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) సదస్సుకు మన్మోహన్ సింగ్, జర్దారీ హాజరవుతున్నారు.