తీవ్రవాదుల రాకెట్ దాడి: 32 అమెరికా సైనికులు మృతి!

ఆదివారం, 7 ఆగస్టు 2011 (11:21 IST)
ఆప్ఘనిస్థాన్‌లోని అమెరికా నేతృత్వంలోని నాటో దళాలకు చెందిన హెలికాఫ్టర్‌పై తాలిబన్ తీవ్రవాదులు రాకెట్ దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 32 మంది అమెరికా సైనికులు మృత్యువాత పడ్డారు. అలాగే, మరో ఏడుగురు ఆప్ఘన్ సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయినట్టు ఆప్ఘన్ అధ్యక్ష కార్యాలయం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.

తూర్పు ఆప్ఘనిస్థాన్‌లోని వార్డాక్ అనే ప్రాంతం పూర్తిగా తాలిబన్ ఆధీనంలో ఉంది. ఈ ప్రాంతంలోని తీవ్రవాదులను ఏరివేసేందుకు అమెరికాతో పాటు నాటో దళాలు కలిసి పోరాటం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాటో దళాలకు చెందిన హెలికాఫ్టర్ ఒకటి ఈ ప్రాంతంపై గస్తీ తిరుగుతుండగా దీనిపై తాలిబన్ తీవ్రవాదులు రాకెట్ దాడులు నిర్వహించారు.

ఈ దాడిలో 32 మంది అమెరికా సైనికులు, ఏడుగురు ఆప్ఘన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమెరికా సైనికుల్లో 16 మంది అమెరికాకు చెందిన నేవీసీల్ అనే విభాగానికి చెందిన వారు కావడం గమనార్హం. ఇటీవల పాకిస్థాన్‌లోని అబొట్టాబాద్‌లో దాగి ఉన్న ఆల్‌ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చిన ఈ నేవీసీల్ బృందం సభ్యులే కావడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి