థాయ్ మసీదుపై దాడి: 10 మంది మృతి

థాయ్‌లాండ్‌లోని సమస్యాత్మక దక్షిణ ముస్లిం ప్రాంతంలో సోమవారం కొందరు సాయుధులు అధునాతన ఆయుధాలతో విచక్షణారహితంగా ఓ మసీదుపై కాల్పులు జరిపారు. సాయంత్రం ప్రార్థనలు చేసేందుకు వచ్చినవారిని లక్ష్యంగా చేసుకొని దుండగులు జరిపిన కాల్పుల్లో పది మంది మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు.

మలేషియా సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రాంతంలో సోమవారం రోడ్డుపక్కన తిరుగుబాటుదారులు అమర్చిన బాంబు పేలిన ఘటనలో తొమ్మిది మంది సైనికులు గాయపడగా, మరో రబ్బరు కార్మికుడు హత్యకు గురైయ్యాడు. 2004 నుంచి థాయ్ దక్షిణ ప్రాంతంలో చీకటి తిరుగుబాటు జరుగుతోంది. ఈ ముస్లిం మెజారిటీ ప్రాంతంలో అనంతరం తరచుగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

తాజాగా ఐదుగురు సాయుధులు నారాథివాట్ జిల్లాలోని చావో ఎయిరోంగ్‌లోని మసీదులో బుల్లెట్ల వర్షం కురిపించారు. ప్రధాన ముస్లిం ప్రావీన్స్‌లుగా గుర్తింపు పొందిన మూడు ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి. ముస్లిం ప్రావీన్స్‌లలో గడిచిన ఐదేళ్లలో 3 వేల మంది పౌరులు హింసాకాండకు బలైయ్యారు. బాంబు దాడులు, తుపాకీ కాల్పులు ఈ ప్రాంతాలను ఇప్పటికీ కలవరపెడుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి