పాక్ పేలుళ్లు: మతపెద్దతోపాటు, 16 మంది మృతి

పాకిస్థాన్‌లో శుక్రవారం వేర్వేరు చోట్ల జరిగిన రెండు ఆత్మాహుతి దాడుల్లో తాలిబాన్ల వ్యతిరేకిగా పేరున్న ప్రముఖ మతపెద్ద, మరో 11 మంది వ్యక్తులు మృతి చెందారు. లాహోర్‌లో ఓ మతగ్రూపును లక్ష్యంగా చేసుకొని మొదటి ఆత్మాహుతి దాడి జరగ్గా, నౌషెరాలోని మసీదుపై రెండో దాడి జరిగింది. ఈ రెండు దాడులకు తాలిబాన్ తీవ్రవాదులు కారణమని అనుమానిస్తున్నారు.

ఇదిలా ఉంటే పాకిస్థాన్‌లోని సమస్యాత్మక నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్‌లో హంగు పట్టణంలో భద్రతా దళాల వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని తీవ్రవాదులు బాంబు దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు పోలీసులు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. పాకిస్థాన్‌లో శుక్రవారం వివిధ ప్రదేశాల్లో జరిగిన ఈ హింసాకాండలో మొత్తం 100 మందికిపైగా గాయపడ్డారు.

ఆత్మాహుతి దాడులు ఇస్లాం వ్యతిరేకమని ఫత్వా తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన మతపెద్ద మౌలానా సర్ఫ్‌రాజ్ నయీమీ లాహోర్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోయారు. తాలిబాన్లకు ఆయన బహిరంగ విమర్శకుడు. లాహోర్ తూర్పు ప్రాంతంలోని జామియా నయీమియా సంస్థ ప్రాంగణంలో శుక్రవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో మౌలానా మృతి చెందారు.

వెబ్దునియా పై చదవండి