పాక్ హెడ్‌క్వార్టర్‌పై తాలిబన్ల దాడి: బందీలకు విముక్తి

ఆదివారం, 11 అక్టోబరు 2009 (11:42 IST)
తన స్వార్థ ప్రయోజనాల కోసం పెంచిపోషించిన తాలిబన్ తీవ్రవాదులు.. చివరకు పాకిస్థాన్‌పైనే తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. సైనిక దుస్తులు ధరించిన కొంతమంది తాలిబన్ ఉగ్రవాదులు ఆదేశ సైనిక ప్రధాన కార్యాలయంపై దాడి చేసి కొంతమందిని బందీలుగా పెట్టుకున్నారు. అయితే, పాక్ సైనిక బలగాలు తీవ్రవాదుల పన్నాగాన్ని తిప్పికొట్టాయి. ఇందులో ఆరుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, నలుగురు తీవ్రవాదులు హతమయ్యారు. అలాగే, తీవ్రవాదుల చెరలో బందీలుగా ఉన్న 30 మందిని వారిని బలగాలు క్షేమంగా విడిపించాయి.

ఆఫ్ఘనిస్థాన్‌ సరిహద్దులోని వాయవ్య ప్రాంతలో ఉన్న ఉగ్రవాదుల బలమైన స్థావరంపై సైనిక చర్యకు సన్నాహాలు జరుపుతున్న సమయంలో రావల్పిండిలోని గట్టి భద్రతా బందోబస్తు మధ్య ఉండే సైనిక ప్రధాన కార్యాలయంపై ఈ దాడి జరగడం గమనార్హం. సాయుధులు ఒక తెల్లటి వ్యాన్‌లో ప్రధాన ద్వారం గుండాలోనికి ప్రవేశించిన వెంటనే కాల్పులు ప్రారంభించారు.

సైనికులు ఎదురు దాడికి పూనుకోగా ఒక గ్రెనేడ్‌ కూడా విసిరినట్లు భద్రతాధికారులు చెప్పారు. ఆ సాయుధులు అనంతరం సుమారు 40 నిమిషాల పాటు సైనికులతో ఎదురు కాల్పులు జరిపారు. నలుగురు సాయుధులు, ఆరుగురు సైనికులు మరణించారని, మరో ఇద్దరు సాయుధులు తప్పించుకుపోయారని సైనికాధికారులు తెలిపారు. పెషావర్‌లో కారుబాంబు పేలి 49 మంది మరణించిన మరుసటిరోజే ఈ దాడి జరిగింది.

కాగా ఈ దాడిని పాక్‌ అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీ, ప్రధాని యూసుఫ్‌ రజా గిలానీ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని, ఇలాంటి హింసాత్మక చర్యలు ఉగ్రవాదంపై పోరాడాలనే తమ దేశ కృతనిశ్చయాన్ని బలహీనపరచలేవని వారు వేరువేరు ప్రకటనల్లో పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి