ప్రతికార దాడులు వద్దు: భారత్ విజ్ఞప్తి

ఆస్ట్రేలియాలో ప్రతీకార దాడులకు ఒడిగట్టవద్దని భారత ప్రభుత్వం మంగళవారం అక్కడి భారతీయులకు విజ్ఞప్తి చేసింది. భారతీయ విద్యార్థులు మెల్‌‍బోర్న్‌లో ప్రతీకార దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణ ఈ విజ్ఞప్తి చేశారు. సంయమనం పాటించాలని, తొందరపడి ప్రతీకార చర్యలకు పూనుకోవద్దని ఆయన కోరారు.

ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థుల రక్షణ కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. తొందరపాటుతో ప్రతీకార చర్యలకు పాల్పడవద్దని పిలుపునిచ్చారు. చదువులపై దృష్టిపెట్టాలని సూచించారు. ఆస్ట్రేలియాలో వరుసగా జరుగుతున్న జాత్యహంకార దాడులపై తాము ఆ దేశ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామన్నారు.

తమ దేశంలోని భారతీయ విద్యార్థులకు రక్షణ కల్పిస్తామని ఆస్ట్రేలియా ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. ఇదిలా ఉంటే అంతకుముందు మెల్‌బోర్న్ పశ్చిమ శివారుల్లో కొందరు భారతీయ విద్యార్థులపై జాతివివక్ష దాడులకు పాల్పడ్డాడని అనుమానిస్తున్న ఓ వ్యక్తిపై కొందరు వ్యక్తులు తాజాగా ప్రతీకార దాడి చేశారు. బాధితుడు జాతివివక్ష వ్యాఖ్యలు చేసినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి