ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో సోమవారం జరగాల్సిన ప్రతిపక్ష ర్యాలీని ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ నిషేధించింది. ఇరాన్‌లో శుక్రవారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పరాజయం పాలైన మాజీ ప్రధానమంత్రి మీర్ హుస్సేన్ మౌసావి మద్దతుదారులు టెహ్రాన్‌లో ఈ రోజు ర్యాలీ నిర్వహించతలపెట్టారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడు మొహమౌద్ అహ్మదీనెజాద్ తిరిగి గెలుపొందిన సంగతి తెలిసిందే.
అయితే అక్రమ మార్గాల్లో అహ్మదీనెజాద్ విజయం సాధించారని ఆయన ఎన్నికల ప్రత్యర్థి ఆరోపిస్తున్నారు. గత రెండు రోజులుగా మౌసావి మద్దతుదారుల విధ్వంస చర్యలతో టెహ్రాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదిలా ఉంటే తాజాగా ఆయన మద్దతుదారులు నిర్వహించ తలపెట్టిన ఎన్నికల ర్యాలీకి అనుమతులు ఇవ్వలేదని ఇరాన్ అంతర్గత వ్యవహారాల శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ర్యాలీని నిర్వహించడం చట్టవ్యతిరేకమని పేర్కొంది.