భౌతిక శాస్త్రంలో డిజిటల్ టెక్నాలజీకి నోబెల్ బహుమతి

బుధవారం, 7 అక్టోబరు 2009 (09:07 IST)
ఈ యేడాది భౌతిక శాస్త్రంలో డిజిటల్ టెక్నాలజీ విభాగానికి నోబెల్ బహుమతి దక్కింది. ఆధునిక డిజిటల్ టెక్నాలజీ అభివృద్ధికి మూలపురుషులుగా పరిగణిస్తున్న ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపికయ్యారు. ఉత్తర అమెరికాకు చెందిన విలార్డ్‌ బాయ్లే, జార్జి స్మిత్‌, చైనా ప్రొఫెసర్‌ చార్లెస్‌ కావోలు ఈ జాబితాలో ఉన్నారు.

ఈ శాస్త్రవేత్తల బృందం డిజిటల్‌ టెక్నాలజీ పితామహులుగా పరిగణిస్తున్నారు. వీరి పరిశోధనల ఫలితమే.. ప్రస్తుతం మానవ సమాజానికి అందుబాటులో ఉన్న ఇంటర్నెట్‌, మొబైల్‌ ఫోన్లు, డిజిటల్‌ కెమెరాల రూపకల్పనకు దారితీశాయి.

దృశ్యరూప కమ్యూనికేషన్లకు వీలుగా గ్లాస్‌ ఫైబర్‌లో కాంతి కిరణ ప్రసారాలకు సంబంధించి వీరు విప్లవాత్మకమైన అంశాలు కనుగొన్నారు. బాయ్లే, స్మిత్‌ ముఖ్యంగా ఇమేజింగ్‌ సెమీ కండక్టర్‌ సర్క్యూట్‌-సిసిడి సెన్సార్‌లను కనుగొని ఆధునిక సమాచార, ప్రసార వ్యవస్థలను కొత్తమార్గం పట్టించారు.

ఈ అవార్డు కింద ఇచ్చే 1.4 మిలియన్‌ డాలర్ల బహుమతిని సగం కావో, మిగతా సగాన్ని మిగతా ఇద్దరు పంచుకోవలసి ఉంటుంది. వీరిలో కావో చైనాలోని షాంఘైలో 1933లో జన్మించారు. ఈయనకు బ్రిటన్‌-అమెరికా పౌరసత్వం ఉంది. బ్రిటన్‌లోని హార్లోలో ఉన్న స్టాండర్డ్‌ టెలికమ్యూనికేషన్‌ లాబొరేటరీ, హాంకాంగ్‌లోని చైనా యూనివర్సిటిలలో పని చేశారు.

ఇక బాయ్లే, స్మిత్‌ న్యూజెర్సీలోని బెల్‌ ల్యాబ్‌లో సెమీ కండక్టర్లపై పరిశోధనలు చేశారు. ఈ ముగ్గురికి నోబెల్‌ బహుమతి డిసెంబర్ ‌10వ తేదీన స్టాక్‌హోంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ప్రదానం చేస్తారు.

వెబ్దునియా పై చదవండి