ముంబాయి దాడులు: పాక్ మంత్రికి కోర్టు ధిక్కార నోటీసు
ముంబాయి దాడులకు సంబంధం ఉన్న ఏడుగురు అనుమానితులపై విచారణ జరుపుతున్న రావల్పిండిలోని పాకిస్థాన్ తీవ్రవాద వ్యతిరేక కోర్టు భారత్‌లో జుడీషియల్ కమీషన్ పర్యటిస్తుందని ప్రకటించినందుకు గానూ పాకిస్థాన్ అంతర్గత శాఖ మంత్రి రెహ్మాన్ మాలిక్‌కు కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. కాగా జుడీషియల్ కమీషన్‌పై కోర్టు ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
డిఫెన్స్ న్యాయవాదులు వేసిన పిటీషన్‌కు స్పందించిన న్యాయమూర్తి షాహిద్ రఫీక్ ఈ ఆదేశాలు జారీ చేశారు. న్యాయస్థానం కమీషన్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనప్పటికీ గత నెలలో మాలిక్ ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పది రోజుల్లో పాకిస్థాన్ కమీషన్ భారత్‌కు వెళ్తుందని పేర్కొన్నారు. మాలిక్ ఇచ్చే వివరణ కోర్టును సంతృప్తి పరచకపోతే మంత్రి నేరుగా కోర్టు ముందు హాజరుకావాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
2008 నవంబర్‌లో భారత ఆర్థిక రాజధాని ముంబాయిపై జరిగిన దాడులకు లష్కరే తోయిబా కమాండర్ జకియిర్ రెహ్మాన్ లఖ్వితో సహా ఏడుగురు పాకిస్థానీ అనుమానితులు వ్యూహరచనతో పాటు ఆర్థిక సహాయం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ దాడుల్లో 166 మంది మృతి చెందారు.