అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గురువారం కైరో విశ్వవిద్యాలయంలో ముస్లిం ప్రపంచాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మధ్యప్రాచ్య ప్రాంతానికి అమెరికాకు మధ్య ఉన్న విభేదాలను తొలగించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. అల్ ఖైదా, తాలిబాన్లపై తాము ఉద్దేశపూర్వకంగా యుద్ధం చేయడం లేదన్నారు. యుద్ధం చేయడం రాజకీయంగా, ఆర్థికంగా కష్టసాధ్యమని తెలిపారు.
ఆప్ఘనిస్థాన్ పునర్నిర్మానానికి 82 మిలియన్ డాలర్ల సాయం చేస్తామన్నారు. ముస్లిం ప్రపంచంతో కొత్త సంబంధాలు కలుపుకునేందుకు తాను ఇక్కడికి వచ్చానని చెప్పారు. అమెరికా ఎప్పటికీ ఇస్లాంతో యుద్ధం చేయదన్నారు. అమెరికాలో ఇస్లాం కూడా ఓ భాగమేనన్నారు. ప్రపంచంలో ఘర్షణాత్మక వాతావరణం తగ్గించాలనేదే అమెరికా ఉద్దేశమని తెలిపారు.
ఆఫ్ఘనిస్థాన్‌లో శాశ్వితంగా అమెరికా సైనికులు ఉంచాలనే ఆలోచన లేదని, ఇరాక్ నుంచి కూడా 2012 నాటికి దళాలను ఉపసంహరిస్తామని తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్‌లలో సమస్యలకు సైనిక చర్య పరిష్కారం కాదని అభిప్రాయపడ్డారు. అమెరికన్లను ముస్లిం ప్రపంచానికి చేరువ చేయడమే తన పర్యటన ప్రధాన ఉద్దేశమని తెలిపారు. మధ్యప్రాచ్య దేశాల్లో అణ్వాయుధ పోటీని నియంత్రించాల్సిన అవసరం ఉందని ఒబామా పేర్కొన్నారు.
ఈజిప్టు పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గురువారం మధ్యప్రాచ్య ప్రాంతంలో శాంతి, ఇరాన్ వివాదాస్పద అణు కార్యక్రమంపై ఆ దేశ అధ్యక్షుడు హోస్నీ ముబారక్‌తో చర్చలు జరిపారు. అనంతరం అమెరికన్లు, ముస్లిం ప్రపంచం మధ్య సత్సంబంధాలు లేకపోవడంపై వాస్తవాలను వెల్లడించారు.