ఆస్ట్రియా రాజధాని వియన్నాలో అక్టోబర్ 12 నుంచి 15వ తేదీల మధ్య "వరల్డ్ న్యూస్ కాంగ్రెస్" సమావేశాలు జరుగనున్నాయి. ప్రస్తుతం పత్రికా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, నాయకత్వ నైపుణ్యాలు, ఆదాయ మార్గాలు తదితర అంశాలపై ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చించనున్నారు. భారత్ సహా ప్రపంచంలోని 120 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరుకానున్నారు.
ఈ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా 18 వేల పత్రికా ప్రచురణ సంస్థలు, 15 వేల ఆన్‌లైన్ న్యూస్ వెబ్‌సైట్లు, మూడు వేల కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్టు నిర్వాహకులు వెల్లడించారు. ఫేస్‌బుక్, గూగుల్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్లు, సెర్చ్‌ఇంజన్ల ద్వారా ఎదురవుతున్న పోటీపై కూడా ఇందులో చర్చించనున్నారు.
ప్రధానంగా, పత్రికా, ప్రింట్, రంగాల్లో చోటు చేసుకుంటున్న అధునాతన మార్పులు, అందుబాటులో ఉన్న టెక్నాలజీ, వాటివల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలు, తదితర సమస్యలపై వివిధ పత్రికా సంస్థలు పరిశోధనా పత్రాలను సమర్పించనున్నాయి.