పాకిస్థాన్ వాయువ్య దిశలోనున్న తాలిబన్ స్థావరాలపై పాక్ సైనిక దళాలు దాడులకు పాల్పడి దాదాపు 20మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది.
తమ సైన్యం 20మంది తాలిబన్ ఉగ్రవాదులను హతమార్చినట్లు పాక్ సైన్యం గురువారం ప్రకటించింది. పాక్ సైన్యం తాలిబన్ ఉగ్రవాదులను హతమార్చేందుకుగాను ఈ వారం ఉత్తర-దక్షిణ ప్రాంతమైన వజీరిస్థాన్ ప్రాంతంలోని సరిహద్దుల్లో సైన్యం ఆపరేషన్ నిర్వహించింది. పాక్ పశ్చిమ ప్రాంతంలోనున్న తాలిబన్, అల్‌ఖైదా స్థావరాలను చుట్టుముట్టి మట్టుబెట్టినట్లు సైనికాధికారలు తెలిపారు.
సైన్యం నిర్వహించిన ఆపరేషన్‌లో ఇప్పటి వరకు 20మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు బన్ను ప్రాంత పోలీసు ఉన్నతాధికారి సయ్యద్ మునీర్ ఖాన్ తెలిపారు. బుధవారం రాత్రి పూర్తిగా ఎదురు కాల్పులు జరిగాయని, ఈ కాల్పుల్లో చాలామంది తీవ్రంగా గాయాలపాలైనట్లు ఆయన వివరించారు.
బన్ను క్షేత్రంనుంచి మృతుల శరీరాలను తాము స్వాధీనం చేసుకున్నామని, గడచిన మంగళ, బుధవారాలలో దాదాపు 40మందికిపైగా మృతి చెందినట్లు సమాచారం.
రాత్రికి రాత్రి 20 మంది తీవ్రవాదులను హతమార్చినట్లు పేషేవార్ పట్టణ పోలీసులు ధృవీకరించారు. ప్రస్తుతం అక్కడ తీవ్రవాదులను హతమార్చేందుకు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు వివరించారు.
ఇదిలావుండగా సైనికాధికారులు మాత్రం ఇప్పటివరకు ఉగ్రవాదుల మృతిపై ఎలాంటి స్పందన కనబరచలేదు. కాగా ప్రస్తుతం తమ సైనికులు జానీ ఖేల్ అనే ప్రాంతాన్ని చుట్టుముట్టామని, ఇక్కడే తాలిబన్లు తమ స్థావరాలను ఏర్పరచుకున్నారని, ఈ స్థావరాలపై తాము తప్పకుండా స్వాధీనం చేసుకుంటామని సైనికాధికారి ఒకరు తెలిపారు.
కాగా తాము ఏప్రిల్ నెల 26వ తేదీనుంచి ఇప్పటివరకు జరిపిన ఆపరేషన్‌లో భాగంగా దాదాపు 1,380మంది తీవ్రవాదులను మట్టుబెట్టినట్లు సైనికాధికారులు వివరించారు.