మిత్రుడు నరేంద్ర మోడీకి తేరుకోలేని షాకిచ్చిన డోనాల్డ్ ట్రంప్

ఠాగూర్

గురువారం, 7 ఆగస్టు 2025 (12:34 IST)
తన ఆప్త మిత్రుడుగా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ తేరుకోలేని షాకిచ్చారు. రష్యా నుంచి నిరంతరాయంగా చమురు కొనుగోలు చేస్తున్నందుకు ప్రతిగా భారత్ నుంచి దిగుమతి అయ్యే కీలక ఉత్పత్తులపై ఏకంగా 50 శాతం మేరకు భారీ సుంకాలను విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో లెదర్, వజ్రాలు-ఆభరణాలు, వస్త్ర, రసాయనాలు వంటి భారత కీలక ఎగుమతి రంగాలు తీవ్ర సంక్షోభం చిక్కుకోనున్నాయి. 
 
అమెరికా ప్రకటించిన ఈ కొత్త సుంకాలు దశలవారీగా అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే ఉన్న సుంకానికి అదనంగా, ఈ రోజు నుంచి 25 శాతం, ఆ తర్వాత ఆగస్టు 27 నుంచి మరో 25 శాతం సుంకాన్ని పెంచనున్నారు. ఈ భారీ పెంపుతో అమెరికాకు వెళ్లే భారత ఎగుమతులు 40 నుంచి 50 శాతం వరకు పడిపోయే ప్రమాదం ఉందని పరిశ్రమ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్ల అమెరికా మార్కెట్‌లో భారత వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి, వాటికి గిరాకీ తగ్గే అవకాశం ఉంది.
 
ఈ సుంకాల ప్రభావం అత్యధికంగా టెక్స్‌టైల్, వజ్రాలు, ఆభరణాలు, లెదర్, పాదరక్షలు, రొయ్యలు, రసాయనాలు, యంత్ర పరికరాల రంగాలపై పడనుంది. ముఖ్యంగా, భారత ఎగుమతుల్లో కీలక పాత్ర పోషిస్తున్న వజ్రాలు, ఆభరణాల పరిశ్రమపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుందని జెమ్ అండ్ జ్యూయలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ వంటి వాణిజ్య సంఘాలు హెచ్చరించాయి. గతంలో అమెరికా 10 శాతం సుంకం విధించినప్పుడే దాదాపు 50,000 మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారని, ఇప్పుడు 50 శాతం పెంపుతో పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు