ఆస్ట్రేలియాలో విద్యార్థుల భద్రతపై చైనా ఆందోళన

ఆస్ట్రేలియాలో ఇటీవల కాలంలో విదేశీ విద్యార్థులపై జరుగుతున్న జాత్యహంకార దాడులపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది. ఆరుగురు భారతీయులపై ఆస్ట్రేలియాలో ఇటీవల కాలంలో దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఇవి జాతివివక్ష దాడులంటూ భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో... చైనా కూడా గొంతుకలిపింది.

ఆస్ట్రేలియా ప్రభుత్వం విదేశీ విద్యార్థులకు మెరుగైన భద్రత కల్పించాలని, వారికి న్యాయబద్ధమైన హక్కులు కల్పించాలని చైనా కోరింది. భారతీయ విద్యార్థులపై ఇటీవల జరిగిన దాడులపై చైనా దౌత్యకార్యలయ కౌన్సెలర్ లీజిన్ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాలో తమ దేశస్తుల భద్రత విషయంలో చైనా ప్రభుత్వం క్రీయాశీలకంగా వ్యవహరిస్తోందని తెలిపారు.

ఆస్ట్రేలియాలో సుమారు 130,000 మంది చైనా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇప్పటివరకు వారికి మెరుగైన విద్య, సరైన నివాస పరిస్థితులు ఉన్నాయని, అయితే ఇటీవల కాలంలో చైనా విద్యార్థులపై కూడా దాడులు జరిగాయని లీ ఓ వార్తాపత్రికతో చెప్పారు. అయితే ఈ దాడులు ఎప్పుడు, ఎక్కడ జరిగాయే చెప్పేందుకు ఆయన నిరాకరించారు.

విదేశీ విద్యార్థుల ద్వారా ఆస్ట్రేలియా విద్యా రంగానికి 15.5 బిలియన్ డాలర్ల ఆదాయం వస్తుండటం గమనార్హం. తాజాగా విదేశీ విద్యార్థులపై జరుగుతున్న దాడులు ఆస్ట్రేలియా విద్యా రంగాన్ని ప్రభావితం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. చదువు కోసం ఆస్ట్రేలియాను ఆశ్రయిస్తున్నవారిలో చైనీయుల శాతం కూడా ఎక్కువగానే ఉంది.

వెబ్దునియా పై చదవండి