ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు అహ్మదీనెజాద్ తిరుగులేని మెజారిటీ సాధించారు. ఇరాన్‌లో శనివారం తాజా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అధికారిక ఫలితాల్లో అహ్మదీనెజాద్ అసాధారణ మెజారిటీ దిశగా ముందుకెళుతుండగా, ఆయనకు పాక్షికంగా పోటీ ఇచ్చిన ప్రత్యర్థి మాత్రం తాజా ఎన్నికల్లో అవకతకవలు జరిగాయని ఆరోపిస్తున్నారు.
అధ్యక్ష ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తారని రాజకీయ విశ్లేషకులు భావించిన మాజీ ప్రధానమంత్రి మీర్‌హుస్సేన్ మౌసావికి నెజాద్ కంటే రెండింతల తక్కువ ఓట్లు పోల్ అయ్యాయి. ఈసారి ఎన్నికలు హోరాహోరీ పోరు తథ్యమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. అయితే అనేక బాలెట్ల లెక్కింపులో నెజాద్‌కు తన ప్రధాన ప్రత్యర్థి మౌసావి కంటే రెండురెట్లు ఎక్కువ ఓట్లు లభించాయి.
ఇదిలా ఉంటే ఎన్నికల ఫలితాలకు వెలువడక ముందు మౌసావి ఎన్నికల జరిగిన తీరుపై అనేక ఫిర్యాదులు చేశారు. అనేక మంది పౌరులు ఓట్లు వేయలేకపోయారని, తాజా ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాల కొరత కూడా ఏర్పడిందని ఆరోపించారు. అంతేకాకుండా యువత, పట్టణ ఓటర్లకు తాను చేరువయ్యేందుకు ఉపయోగించుకోవాలనుకున్న ఎస్ఎంఎస్ ప్రచారాన్ని అధికారిక యంత్రాంగం నిషేధించడాన్ని మౌసావి తప్పుబట్టారు.
ఇరాన్ ఎన్నికల సంఘం శుక్రవారం దేశవ్యాప్తంగా అధ్యక్ష ఎన్నికలను విజయవంతంగా నిర్వహించింది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం ఇరాన్ అధ్యక్షుడు అహ్మెదీనెజాద్ 65 శాతం ఓట్లతో ముందున్నారు. ఇప్పటివరకు 29 మిలియన్ బ్యాలెట్లలో ఓట్ల లెక్కింపు పూర్తయింది. మౌసావికి 32 శాతం ఓట్లు మాత్రమే లభించాయి.
ఇరాన్‌లో మొత్తం 46 మిలియన్ల మంది ఓటర్లు ఉన్నారు. తాజా ఎన్నికల్లో 80 శాతం పోలింగ్ నమోదయింది. మిగిలిన బ్యాలెట్లలో ఓట్ల లెక్కింపు పూర్తయినా కూడా మౌసావికి విజయవకాశాలు ఉండబోవు. ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ డాక్టర్ అహ్మదీనెజాద్ తాజా ఎన్నికల్లో తిరిగి విజయం సాధించినట్లు వెల్లడించింది. తుది ఫలితాలు అంతర్జాతీయ కాలమానం ప్రకారం శనివారం 03.30 గంటలకు వెలువడతాయని తెలిపింది.