అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రమాదవశాత్తూ కూలిపోయిన ఎయిర్ ఫ్రాన్స్ విమానం తొలి శకలాలు గురువారం బ్రెజిల్ హెలికాప్టర్ సిబ్బందికి లభ్యమయ్యాయి. విమాన నిర్మాణంలో భాగమైన 2.5 మీటర్ల పొడవున్న ఓ ముక్కను బ్రెజిల్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలా ఉంటే ఇది లభ్యమైన ప్రదేశంలో మానవ దేహాల జాడలేమీ కనిపించలేదని బ్రెజిల్ అధికారిక యంత్రాంగం తెలిపింది. ఎయిర్ ఫ్రాన్స్‌కు చెందిన జెట్ విమానం సోమవారం బ్రెజిల్ రాజధాని రియో డి జెనీరో నుంచి పారిస్‌కు వెళుతూ తుపాను, పిడుగుపాటు, విద్యుత్ సరఫరాలో సాంకేతిక సమస్యల కారణంగా అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయింది.
ఈ విమానంలోని 228 మంది ప్రయాణికులు మృతి చెందారు. నీటిమీద తేలుతున్న రెండు విమాన భాగాలు కూడా లభ్యమయ్యాయని బ్రెజిల్ అధికారులు తెలిపారు. కూలిపోయిన విమానానికి సంబంధించి లభ్యమైన తొలి శకలాలు ఇవే కావడం గమనార్హం. 2001 తరువాత ప్రపంచంలో జరిగిన ఘోర విమాన ప్రమాదం కూడా ఇదే.