ఎల్టీటీఈకి మద్దతు ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు తమిళ్- అమెరికన్లు తమపై మోపిన అభియోగాలను అంగీకరించారు. ఆయుధాలు, పేలుడు పదార్థాల కొనుగోలుతోపాటు, ఇతర రూపాల్లో ఎల్టీటీఈకి తాము మద్దతిచ్చామని నలుగురు అమెరికా తమిళులు అంగీకరించారని ఆ దేశ అటార్నీ జనరల్ బెంటోన్ జె క్యాంబెల్ తెలిపారు.
శ్రీలంకలో వేర్పాటువాద ఉద్యమం నడిపిన ఎల్టీటీఈ ప్రభుత్వ దళాలతో జరిపిన యుద్ధంలో కొన్నివారాల క్రితం పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అమెరికాలో ఎల్టీటీఈ చీఫ్‌తోపాటు, అతనికి మద్దతిచ్చిన ముగ్గురు వ్యక్తులను చట్టం ముందుకుతీసుకొచ్చామని క్యాంబెల్ చెప్పారు.
నలుగురు నిందితులను కరుణాకరన్ కందస్వామి అలియాస్ కరుణ, ప్రతీపన్ థవరాజా అలియాస్ రాజా ప్రతీపన్ (తంబి సంప్రాస్, స్టీబాన్), మురుగేసు వినాయకమూర్తి అలియాస్ డాక్టర్ మూర్తి (వినాయకమూర్తి మురగేసు), విజయశాంతర్ పద్మనాధన్ అలియాస్ చందులుగా గర్తించారు. ఎల్టీటీఈ కోసం ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం సేకరించడం, కొన్ని మిలయన్ డాలర్ల నిధులు కూడబెట్టడం వంటి కార్యకలాపాల్లో తమ ప్రమేయాన్ని నిందితులు కోర్టులో అంగీకరించారని క్యాంబెల్ వెల్లడించారు.