కొన్ని జాత్యహంకార దాడులే: ఆస్ట్రేలియా

భారతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని ఇటీవల వరుసగా జరిగిన దాడుల్లో కొన్ని జాత్యహంకారంతో కూడుకున్నవేనని ఆస్ట్రేలియా పోలీసులు అంగీకరించారు. ఆస్ట్రేలియాలో భారతీయులపై జాత్యహంకార దాడులు జరిగాయని ఆ దేశ అధికారిక యంత్రాంగం అంగీకరించడం ఇదే తొలిసారి.

ఇప్పటివరకు భారతీయులపై జరిగిన దాడుల్లో జాతివివక్ష లేదని ఆస్ట్రేలియా ప్రభుత్వం చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా విక్టోరియా రాష్ట్ర పోలీసు చీఫ్ సైమన్ ఒవర్లాండ్ భారతీయ విద్యార్థులపై దేశంలో జరిగిన దాడుల్లో కొన్ని జాత్యహంకారపూరితమైనవేనని చెప్పారు. విక్టోరియా రాజధాని మెల్‌బోర్న్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని దోపిడి దాడులు జాతివివక్షతో కూడుకున్నవని, మిగిలినవాటికి జాతివివక్ష కారణం కాదన్నారు.

దాడులకు కారణం ఏదైనా భారతీయుల పరిస్థితి బాగాలేదు. హింసాకాండ, వారిని దోచుకోవడం సరికాదని ఒవర్లాండ్ పేర్కొన్నారు. సమాజంలో జాతివివక్షకు చోటులేదన్నారు. గడిచిన నెల రోజుల్లో భారతీయులపై 11 దాడులు జరిగిన సంగతి తెలిసిందే.

తమపై జరుగుతున్న దాడులకు ప్రతీకారంగా భారతీయులు కూడా ఓ ఆస్ట్రేలియన్‌పై దాడి చేసినట్లు సోమవారం వార్తలు వచ్చాయి. దీంతో భారత ప్రభుత్వం వెంటనే స్పందించింది. సంయమనం పాటించాలని, ప్రతీకార చర్యలకు దూరంగా ఉండాలని ఆస్ట్రేలియాలోని భారతీయులకు విదేశాంగ శాఖ మంత్రి ఎస్ఎం కృష్ణ విజ్ఞప్తి చేశారు. భారతీయుల భద్రతపై ఎప్పటికప్పుడు ఆస్ట్రేలియా ప్రభుత్వంతో మాట్లాడుతున్నామన్నారు.

వెబ్దునియా పై చదవండి