గూగుల్, ఈ పేరు వినని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. గూగుల్ ఇంటర్‌నెట్ వ్యవస్థాపకుల గురువు రాజీవ్ మొత్వానీ (47) తన ఇంటి ఆవరణలో ఉన్న ఈతకొలనులో ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు.
భారత్‌కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత కంప్యూటర్ రంగ నిపుణుడు. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా పనిచేస్తున్న రాజీవ్ మొత్వానీ(47)శనివారం ప్రమాదంలో చనిపోయారు.
ప్రముఖ ఇంటర్నెట్ సెర్చ్‌ఇంజన్ గూగుల్ వ్యవస్థాపకులు సెర్గీ బ్రీన్, లారీ పేజ్‌లకు ఆయన సలహాదారుగా కీర్తిప్రతిష్టలు గడించారు. ఈయన కంప్యూటర్ కోర్సుల బోధనలో ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించారు.
1962వ సంవత్సరంలో భారత్‌లోని జమ్మూలో జన్మించిన ఈయన బాల్యం దేశ రాజధాని ఢిల్లీలో గడిచింది. 1983వ సంవత్సరంలో కాన్పూర్ ఐఐటీనుంచి కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. కాలిఫోర్నియాలోని బెర్కలీ విశ్వవిద్యాలయంనుంచి 1988వ సంవత్సరంలో డాక్టరేట్ ఉపాధిని పొందారు. ఆ తర్వాత స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా చేరారు.
ఇదిలావుండగా కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానానికి రాజధానిగా పేర్కొనే సిలికాన్ వ్యాలీ అభివృద్ధికి మొత్వానీ అవిరళ కృషి జరిపినట్లు ఆయన మిత్రులు తెలిపారు. కాగా ఆయనకు అంతగా ఈత రాదని ఆయన మిత్రులు తెలిపారు.
మొత్వానీ మృతి కంపక్యూటర్ సైన్స్‌కు, అలాగే దానిని అభ్యసించే పలువురు విద్యార్థులకు తీరనిలోటని ఆ రంగానికి చెందిన పలువురు నిపుణులు శోకతప్త హృదయాలతో తెలిపారు.