ఐదు సంవత్సరాల్లో ఆరు మంది ప్రధానమంత్రులను చూసిన జపాన్ ప్రజలు ఈ నెల చివరికి మరో కొత్త నాయకుడి పాలనను అందుకోనున్నట్లు స్థానిక దినపత్రికలు కథనాలను ప్రచురించాయి. సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రస్తుత ప్రధాని నొవొటో కన్ త్వరలో రాజీనామా చేయనున్నారని పేర్కొన్నాయి.
గత ఏడాది జూన్‌లో ప్రధాని పదవిని చేపట్టిన కన్ మార్చి 11న సంభవించిన భూకంపం, సునామీ, అణు విపత్తులను ఎదుర్కోవడంలో విఫలమవడంతో గద్దె దిగాలని ప్రతిపక్షం కన్జర్వేటివ్ పార్టీతో పాటు కొంతమంది సొంత పార్టీ సభ్యులు కూడా తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు. క్యాబినేట్‌లో కూడా సుమారు 15 శాతం మంది ఆయన్ను వ్యతిరేకిస్తున్నారు.
విపత్తు పునర్నిర్మాణానికి అదనపు బడ్జెట్ రూపకల్పన, కొత్త బాండ్ల రూపంలో ఆర్ధిక సహాయం చేసే బిల్లు, పునరుత్పాదన శక్తి చట్టాన్ని చేసిన తర్వాత తాను పదవి నుంచి వైదొలుగుతానని 64 ఏళ్ల కన్ కొన్ని వారాల క్రితం అభయం ఇచ్చారు.