ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాదుల దాడులకు సోమాలియా అనుకూలంగా ఉన్నట్లు యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన రిస్క్ అనాలిసిస్, మ్యాపింగ్ సంస్థ మాపుల్‌క్రాఫ్ట్ వెల్లడించింది. మాపుల్‌క్రాఫ్ట్ తాజాగా విడుదల చేసిన తీవ్రవాద ముప్పు సూచీ(టీఆర్‌ఐ)లో 20 దేశాలు, ప్రాంతాలకు తీవ్రవాదుల నుంచి అధిక ముప్పు ఉన్నట్లు పేర్కొంది.
ఈ కేటగరీలో సోమాలియా తర్వాత పాకిస్థాన్(2), ఇరాక్(3), ఆఫ్ఘనిస్థాన్(4), నూతనంగా ఏర్పడ్డ దక్షిణ సూడాన్(5)లు ముందు వరుసలో ఉన్నాయి. మాపుల్‌క్రాఫ్ట్ 2010 నవంబర్‌లో చేసిన సర్వే జాబితాలోని మొదటి నాలుగు ర్యాంకింగ్స్‌లో ఎలాంటి మార్పు లేదు. అధిక ముప్పు క్యాటగరీలో భారత్ కూడా ఉంది. మాపుల్‌క్రాఫ్ట్ 2010 నివేదికలో భారత్ 16వ ర్యాంక్ పొందగా ప్రస్తుతం 18వ స్థానంలో ఉంది.
అల్‌ఖైదా ప్రాంతీయ విభాగాల నుంచి ముప్పు పెరిగింది. ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా దళాలు హతమార్చిన తర్వాత పాకిస్థాన్‌లో తీవ్రవాదుల ప్రతీకార దాడులు పెరిగాయని సర్వే తెలిపింది. 2010 ఏప్రిల్ నుంచి 2011 మార్చి మధ్య కాలంలో జరిగిన దాడులను లెక్కలోకి తీసుకొని మాపుల్‌క్రాఫ్ట్ సర్వే చేసింది.
తీవ్రవాదులు నుంచి అధిక ముప్పు ఉన్న పాశ్చాత్య యూరోపియన్ దేశం గ్రీస్. ఇది 27వ స్థానంలో ఉంది. బ్రిటన్ 38వ స్థానంలో ఉండగా ఫ్రాన్స్ 45వ స్థానంలో ఉంది. నార్వో రాజధాని ఓస్లోతో పాటు సమీప ఐస్‌లాండ్‌లో ముస్లీం వ్యతిరేకి ఆండర్స్ బెహ్రింగ్ బ్రేయివిక్ 77 మందిని హతమార్చిన ఇటీవలి సంఘటనను ఈ సర్వే పరిగణనలోనికి తీసుకోలేదు.