నిర్లక్ష్యమే విమాన ప్రమాదానికి కారణమా...!

ఎయిర్ ఫ్రాన్స్ ఎఫ్-447 విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి మృత దేహాలు మరికొన్ని ఆదివారం లభించాయి. ఈ ప్రమాదానికి నిర్లక్ష్యమే ప్రధాన కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలు లభించినట్లు బ్రెజిల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అధికార ప్రతినిధి వెల్లడించారు. బ్రెజిల్‌ నుంచి పారిస్‌ వెళ్తున్న ఫ్రాన్స్‌ ఏఎఫ్‌-447 విమానం సోమవారం పిడుగుపాటుకు గురై అట్లాంటిక్‌ మహాసముద్రంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 228మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

ప్రమాద కారణాల విశ్లేషణకు అవసరమైన ఆధారాల అన్వేషణ ముమ్మరంగా సాగుతోంది. విమానం కూలిపోయిన ప్రాంతాన్ని చేరిన ఓ ఫ్రాన్స్ జలాతర్గామి బ్లాక్ బాక్స్(ఫ్లైట్ డేటా రికార్డ్స్) నుంచి వెలువడే సంకేతాలను వినడానికి ప్రయత్నిస్తోంది.

తొలుత ఇద్దరు పురుషులకు సంబంధించిన శవాలను, కొన్ని శిథిలమైన వస్తువులను శనివారం ఉదయం కనుగొన్నట్లు బ్రెజిల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అధికార ప్రతినిధి జోర్గే అమరాల్‌ తెలిపారు. ఆదివారం ఉదయం 8.14 నిమిషాలకు రెండు శవాలను కనుగొన్నట్లు ఆయన పేర్కొన్నారు. అవి ఎయిర్‌ ఫ్రాన్స్‌ ప్రమాదానికి చెందినవేనని ధ్రువీకరించినట్లుకూడా ఆయన చెప్పారు.

శిథిలమైన వస్తువులకు సంబంధించి అవి ఎయిర్‌ ఫ్రాన్స్‌ విమానానికి చెందిన సీటు, దాని సీరియల్‌ నంబర్‌తో సహా కనుగొన్నట్లు అమరాల్‌ తెలిపారు. అనంతరం ఆదివారం బ్రెజిల్‌కు చెందిన నావికాదళ సిబ్బంది మరో మూడు శవాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి అట్లాంటింక్‌ మహా సముద్రంలో ఫ్రాన్స్‌ విమాన శకలాల కోసం అన్వేషణ మొదలైంది.

వివిధ దేశాల నౌకలు ఆ ప్రదేశానికి చేరు కుని గాలింపు మొదలు పెట్టాయి. ప్రమాద స్థలం వద్దకు బుధవారం మొదటగా బ్రెజిల్‌ నౌకలు చేరుకోగా ఆ తరువాత ఫ్రాన్స్‌, నెదర్లాండ్స్‌ల నుంచి మరో మూడు కార్గో నౌకలు కూడా వచ్చి చేరాయి. బ్రెజిల్‌ వైమానిక దళ విమానం ఒకటి సెన్సార్ల సాయంతో ఫెర్నాండో డీ నొరోన్హా ద్వీప సమీపంలోని 500 కిలోమీటర్ల ప్రాంతాన్ని జల్లెడపడుతోంది.

ఇదిలావుండగా విమానం రెక్కనుంచి లేదా ఇంధనం ట్యాంకునుంచి బయటకు వచ్చే పైలట్ ట్యూబ్స్ విమానం వేగం, కోణం, బయటి ఉష్ణోగ్రత లాంటి సమాచారాన్ని అందించే సాధనాలు, అవి సరిగ్గా పనిచేయకపోతే వేగాన్ని గుర్తించే స్పీడ్ సెన్సార్లు విమానాన్ని నియంత్రించే కంప్యూటర్‌కు తప్పుడు సమాచారాన్ని అందిస్తాయి. దీంతో కంప్యూటర్ అవసరమైన దానికంటే ఎక్కువ లేదా తక్కువ వేగంతో విమానం ప్రయాణించేలా చేస్తుంది. ఇలాంటి పొరపాట్ల వలన విమానం ప్రమాదాలకు లోనయ్యే అవకాశాలు ఎక్కువేనని నిపుణులు అంటున్నారు.

నిరుడు ఎయిర్ ఫ్రాన్స్ అన్ని విమానాల లైలట్ ట్యూబులను మార్చారని తయారీ సంస్థకు తెలిపింది. ఆ సంస్థకూడా తన వినియోగదారులందరికీ ఈ పైలట్ ట్యూబులను మార్చుకోవాలని సూచించింది. అయితే ఈ మార్పిడి వ్యయాన్ని తయారీ సంస్థే భరించాలని ఎయిర్ ఫ్రాన్స్ పట్టుబట్టింది. దీంతో ఆ కార్యక్రమం కాస్తా మూలనపడింది. అలా ఎయిర్ ఫ్రాన్స్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘోర ప్రమాదం సంభవించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

వెబ్దునియా పై చదవండి