పాకిస్థాన్ ఆర్థిక రాజధాని కరాచీలో జూన్ మొదటివారంలో మొత్తం 29 రాజకీయ హత్యలు జరిగాయి. వీటిలో ఎనిమిది హత్యలు ఒక్క ఆదివారమే జరగడం గమనార్హం. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. ఆదివారం హత్యకు గురైనవారిలో ఆరుగురు అర్ఫాత్ అహ్మద్ నేతృత్వంలోని ముత్తాహిదా కవామీ ఉద్యమం (ఎంక్యూఎం- హెచ్)లోని హఖీఖీ వర్గానికి చెందినవారు.
మరొకరు అల్తాఫ్ అహ్మద్ నేతృత్వంలోని ఎంక్యూఎంకు చెందిన వ్యక్తి కాగా, ఎనిమిదో వ్యక్తి అవామీ నేషనల్ పార్టీ (ఏఎన్‌పీ)కి చెందిన కార్యకర్త అని పోలీసులు తెలిపారు. నగరంలో మైనారిటీ పాఖ్తూన్ వర్గానికి ఏఎన్‌పీ నేతృత్వం వహిస్తోంది.
మెజారిటీ మొహజీర్ వర్గానికి ఎంక్యూఎం నేతృత్వం వహిస్తోంది. ఈ రెండు వర్గాల మధ్య తరచుగా ఘర్షణలు జరుగుతుంటాయి. ఇదిలా ఉంటే రాజకీయేతర హత్యల్లో మరో ఆరుగురు మృతి చెందారని పోలీసులు వెల్లడించారు.