పాకిస్థాన్‌లో బాంబు పేలుడు: 40 మంది మృతి

పాకిస్థాన్‌లోని సమస్యాత్మక నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్‌లో శుక్రవారం ప్రార్థనల సందర్భంగా ఓ మసీదుపై బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో 40 మంది మృతి చెందారు. పాక్ వాయువ్య ప్రాంతంలోని ఓ మారుమూల ప్రదేశంలో ఈ దాడి జరిగిందని అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రార్థనకు వచ్చినవారిని లక్ష్యంగా చేసుకొని తీవ్రవాదులు ఈ బాంబు దాడి చేశారు.

దాడిలో గాయపడినవారిపై ఎటువంటి సమాచారం లేదని నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్ ఎగువ దీర్ జిల్లా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇదిలా ఉంటే అంతకుముందు పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో, దాని సమీపంలోని రావల్పిండిలో పోలీసులు ఆత్మాహుతి దళ సభ్యులను అరెస్టు చేశారు.

మరోవైపు స్వాత్ లోయలో తాలిబాన్ తీవ్రవాదులను తుడిచిపెట్టిన అనంతరం ఏం చేయాలనే దానిపై ప్రస్తుతం పాక్ పర్యటనలోనే ఉన్న అమెరికా ప్రత్యేక రాయబారి రిచర్డ్ హోల్‌బ్రూక్ తమ దేశ నేతలతో చర్చలు జరిపినట్లు అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రెహమాన్ మాలిక్ వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి