పాకిస్థాన్‌లో తాలిబాన్ తీవ్రవాదులపై మిలిటరీ చేపట్టిన సైనిక చర్య కారణంగా ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాల్లోని సహాయక శిబిరాల్లో తలదాచుకున్న పౌరుల సహాయార్థం జపాన్ ప్రభుత్వం 10 మిలియన్ డాలర్ల సాయం చేయనుంది. పాకిస్థాన్‌లోని సమస్యాత్మక నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్‌లో గత కొన్ని వారాలుగా పాక్ మిలిటరీ ఆపరేషన్ కొనసాగుతోంది.
ఈ ఆపరేషన్ల కారణంగా శరణార్థులైన వారి కోసం జపాన్ ప్రభుత్వం 10 మిలియన్ డాలర్ల అత్యవసర సాయాన్ని అందించనున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి హిరోఫుమీ నాకోసన్ మంగళవారం వెల్లడించారు. వచ్చే రెండేళ్లకాలంలో జపాన్ ప్రభుత్వం 1 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని అందజేస్తామని పాకిస్థాన్‌కు హామీ ఇచ్చింది.
తాజాగా మంజూరు చేయాలనుకుంటున్న ఆర్థిక సాయం కూడా ఇందులో భాగమే. తాజా సైనిక చర్య కారణంగా సుమారు 3 మిలియన్ల మంది పాక్ పౌరులు ప్రభుత్వ సాయంపై ఆధారపడి ఉన్నారు. దేశంలోని సమస్యాత్మక స్వాత్ లోయలో ప్రభుత్వానికి ముప్పుగా పరిణమించిన తాలిబాన్ తీవ్రవాదులను అణిచివేసేందుకు పాక్ ఈ సైనిక చర్య చేపట్టింది.