పాక్ ఆర్మీ నిర్మాణంలో అమెరికా నిధులు

తీవ్రవాదంపై పోరు కోసం తాము అందజేసిన నిధులను పాకిస్థాన్ తన ఆర్మీని నిర్మించుకునేందుకు ఉపయోగించిందని అమెరికా రక్షణ శాఖ పత్రాలు వెల్లడించాయి. భారత్‌తో పోటీ కోసం పాకిస్థాన్ తీవ్రవాదంపై పోరు కోసం వచ్చిన నిధులను దుర్వినియోగం చేసిందని అవి పేర్కొన్నాయి.

తాజాగా వెల్లడైన వార్తా కథనం ప్రకారం.. గతంలో అధికారంలో ఉన్న బుష్ ప్రభుత్వం వద్ద అమెరికా అందించిన నిధులను పాకిస్థాన్ దుర్వినియోగం చేసిందనేందుకు ఆధారాలు ఉన్నాయి. బుష్ హయాంలో అమెరికా ప్రభుత్వం పాకిస్థాన్‌కు 1.9 బిలియన్ డాలర్ల విదేశీ మిలటరీ సాయాన్ని అందించడంతోపాటు, మిలటరీ అమ్మకాలకు సంబంధించి 5 బిలియన్ డాలర్ల ఒప్పందాలు కూడా కుదర్చుకుంది.

పాకిస్థాన్ వద్ద 60 అణ్వాయుధాలు ఉన్నాయని ఇప్పటికే ఓ అమెరికా నివేదిక వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా వెల్లడైన నివేదిక పాకిస్థాన్‌ ప్రభుత్వం బుష్ హయాంలో అందిన నిధులను ప్రధానంగా తీవ్రవాదంపై పోరుకు ఉపయోగించలేదని తెలిపింది. ఆ సమయంలోనే తాలిబాన్, అల్ ఖైదా తీవ్రవాదులు ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లోని పాక్ గిరిజన ప్రాంతాల్లో సురక్షిత స్థావరాలు పొందారని పేర్కొంది.

పాక్ ప్రభుత్వం విదేశీ మిలటరీ ఫైనాన్సింగ్ (ఎఫ్ఎంఎఫ్) కింద ఎనిమిది పి-3సి మారిటైమ్ పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు కొనుగోలు చేసింది. అంతేకాకుండా 5,250 టౌ యాంటీ ఆర్మూర్ మిస్సైళ్ల కొనుగోలుకు ఆర్డర్లు పెట్టింది. వీటిలో 2,007 మిస్సైళ్లు ఇప్పటికే అమెరికా ప్రభుత్వం పాకిస్థాన్‌కు సరఫరా చేసింది. మిగిలినవాటిని సరఫరా చేయాల్సి ఉంది. 5,600 మిలటరీ రేడియో సెట్లు, ఆరు ఏఎన్/టీపీఎస్- 77 రాడార్లు, ఆరు సి-130ఈ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్, 20 ఏహెచ్- 1ఎఫ్ కోబ్రా హెలికాఫ్టర్లు పొందింది.

వెబ్దునియా పై చదవండి