తమ దేశాన్ని లక్ష్యంగా చేసుకుంటున్న తీవ్రవాద సంస్థలపై విశ్వసనీయ చర్యలు తీసుకునే వరకు ఉపఖండ చర్చల ప్రక్రియ పునరుద్ధరించబడదని గురువారం భారత్ స్పష్టం చేసింది. పాకిస్థాన్ వారి భూభాగంలోని తీవ్రవాద గ్రూపులపై విశ్వసనీయ చర్యలు తీసుకోవాలని, ఆ తరువాతే ఇరుదేశాల మధ్య శాంతి ప్రక్రియ చర్చలు పునఃప్రారంభిస్తామని తేల్చిచెప్పింది.
గత ఏడాది నవంబరులో జరిగిన ముంబయి ఉగ్రవాద దాడుల అనంతరం పాకిస్థాన్‌తో చర్చల ప్రక్రియను భారత్ నిలిపివేసింది. తమ ఈ వైఖరినిలో ఎటువంటి మార్పు లేదని భారత విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణ తెలిపారు. భారత్‌ను దెబ్బతీయాలనుకుంటున్న తీవ్రవాద గ్రూపులపై పాకిస్థాన్ చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పారు. అప్పటివరకు చర్చలు ఉండవన్నారు.
పాకిస్థాన్ ప్రభుత్వం బేషరతు చర్చల పునరుద్ధరణను కోరుతుండటంపై స్పందిస్తూ ఎస్ఎం కృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే అంతకుముందు పాకిస్థాన్ విదేశాంగ ప్రతినిధి అద్బుల్ బసీర్ మాట్లాడుతూ.. ఇరుదేశాలు ఒకదానినొకటి అర్థం చేసుకోవడానికి చర్చలు అవసరమన్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకునేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయని తెలిపారు.