పాక్ హోటల్ పేలుడులో తాలిబాన్ల హస్తం

పాకిస్థాన్‌లోని సమస్యాత్మక నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్ రాజధాని పెషావర్‌లో మంగళవారం రాత్రి జరిగిన బాంబు పేలుడులో తాలిబాన్ తీవ్రవాదుల హస్తం ఉందని ఆ దేశ పోలీసులు అనుమానిస్తున్నారు. పెషావర్‌లోని పెరల్ కాంటినెంటల్ హోటల్‌లో సంభవించిన శక్తివంతమైన బాంబు పేలుడులో 18 మంది మృతి చెందారు.

మృతుల్లో ఇద్దరు ఐక్యరాజ్యసమితి ఉద్యోగులతోపాటు, ముగ్గురు విదేశీయులు కూడా ఉన్నారు. ఇదిలా ఉండే ఈ కారు బాంబు దాడిలో మరో 50 మంది గాయపడ్డారు. గాయపడినవారిలోనూ ఎక్కువ మంది విదేశీయులు ఉన్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఎనిమిది మంది గాయపడినవారి పరిస్థితి విషమంగా ఉందన్నారు.

ఇదిలా ఉంటే ఈ కారు బాంబు దాడికి తాలిబాన్ తీవ్రవాదులు కారణమని పాకిస్థాన్ పోలీసులు ఆరోపించారు. గత కొన్నిరోజులుగా నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్‌లోని స్వాత్ లోయలో తాలిబాన్ తీవ్రవాదులను అణిచివేసేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం సైనిక చర్యలు చేపట్టింది. వీటికి ప్రతీకారంగా తాలిబాన్లు పెరల్ హోటల్‌లో బాంబు దాడి చేసి ఉంటారని పోలీసులు పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి