పాక్‌తో చర్చల గురించి ఆలోచించండి: అమెరికా

పాకిస్తాన్‌తో చర్చలు జరపాలా, వద్దా అనే విషయంలో నిర్ణయం భారత్‌దేనని అగ్రరాజ్యం అమెరికా తేల్చిచెప్పింది. అదేసమయంలో ముంబాయి దాడి నిందితులను శిక్షించేందుకై భారత్‌కు సహకరించే విషయమై పాక్ పూర్తి చర్యలను తీసుకోవాలని అమెరికా సూచించింది.

అమెరికా అండర్‌ సెక్రటరీ విలియం బర్న్స్‌ గురువారం న్యూఢిల్లీ విచ్చేసిన సందర్భంగా ప్రధాని మన్మోహన్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరూ ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ భేటీ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ఒబామా ఇచ్చిన లేఖను బర్న్స్ ప్రధాని మన్మోహన్‌కు అందజేశారు.

దీని ప్రకారం భారత్‌ తమకు అతి ముఖ్యమైన గ్లోబల్‌ భాగస్వామి అని అమెరికా పేర్కొంది. అందుకే భారత్‌తో సంబంధాలు మరింతగా పటిష్టం చేసుకునేందుకు తాము కట్టుబడి ఉన్నామని అమెరికా తెలిపింది.

వెబ్దునియా పై చదవండి