పాకిస్థాన్‌లోని వాయువ్యప్రాంతంలోనున్న పేషావర్‌లో శుక్రవారం కారుబాంబు పేలుళ్ళు జరిగాయి. ఈ పేలుళ్ళలో 15 మంది మృతి చెందారు.
పాక్‌లోని వాయువ్యప్రాంతమైన పేషావర్‌లో జనసమర్ధమైన ఖైబర్ బజారులో ఓ బస్సువద్ద కారుబాంబు పేలింది. దీంతో 15 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 14 మంది తీవ్రగాయాల పాలైనారు.
పేషావర్‌లోని ఖైబర్ బజారులో జనసమర్ధమైన ప్రాంతంలో పేలుడు పదార్థాలతో నిండిన కారు బస్సును గుద్దుకోవడంతో పేలుళ్ళు జరిగాయని, ఇందులో దాదాపు 15 మంది మృతి చెందారని పాక్ సమాచార శాఖామంత్రి మియాం ఇఫ్తికార్ హుస్సేన్ వెల్లడించారు.
పేలుడు జరిగిన ప్రాంతానికి అతి సమీపంలో ఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ అసెంబ్లీ కూడా ఉందని, ఈ పేలుళ్ళలో మరో 14 మంది తీవ్రగాయాలపాలైనారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. గాయాలపాలైనవారిని చికిత్సనిమిత్తం స్థానిక ఆసుపత్రిలో చేర్పించామని వారు పేర్కొన్నారు.
ప్రధానంగా ఈ దాడులకు అల్‍ఖైదాతో చేతులు కలిపిన పాక్ తాలిబన్ మిలిటెంట్లేనని, పాక్‌లోని పట్టణాలు, నగరాలు, ముఖ్యంగా కట్టుదిట్టమైన భద్రతా కార్యాలయాల వద్దే వీరు దాడులకు పాల్పడుతారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. కాగా ఇప్పటి వరకు ఎవ్వరుకూడా ఈ దాడులకు బాధ్యత వహిస్తూ ఎలాంటి సూచన చేయలేదని వారు తెలిపారు.
ఇదిలావుండగా ఆఫ్గన్ సరిహద్దు ప్రాంతంలోని దక్షిణ వజీరిస్తాన్ ప్రాంతంలోనున్న తాలిబన్లను హతమార్చేందుకు వెళ్ళాలని పాక్ ప్రభుత్వం ఆర్మీని కోరింది.