పెషావర్‌లో మంగళవారం ఓ ఐదు నక్షత్రాల హోటల్‌లో శక్తివంతమైన బాంబు పేలుడు సంభవించడంతో 11 మంది మృతి చెందారు. నగరంలో గట్టి భద్రత ఉండే ప్రదేశంలో ఉన్న ఈ హోటల్‌పై జరిగిన బాంబు దాడిలో మరో 50 మంది గాయపడ్డారు. పాకిస్థాన్‌లోని సమస్యాత్మక నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్ రాజధాని పెషావర్‌లో కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న పెరల్ కాంటినెంటల్ హోటల్‌పై బాంబు దాడి జరిగింది.
హోటల్ ప్రాగంణంలో మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో బాంబు పేలుడు సంభవించింది. బాంబు పేలుడు తీవ్రతకు హోటల్ వెనుకభాగం కూలిపోయింది. ఏడు కిలోమీటర్ల దూరం వరకు పేలుడు శబ్దం వినిపించిందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ బాంబు పేలుడులో ఐదుగురు మృతి చెందారని పోలీసులు చెబుతుండగా, మృతుల సంఖ్య పదికిపైగానే ఉందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. హోటల్ ప్రాంగణంలోని 30 వాహనాలు బాంబు పేలుడులో ధ్వంసం అయ్యాయి.
సమీపంలోని మసీదు కూడా దెబ్బతింది. ఈ హోటల్‌పై జరిగిన బాంబు దాడిలో గాయపడినవారిలో ప్రావీన్స్ మంత్రి, ఓ చట్టసభ సభ్యుడు ఉన్నట్లు తెలుస్తోంది. బాంబు పేలుడుకు ముందు ఐదుగురు సాయుధులు హోటల్‌లోకి వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపారని సాక్షులు తెలిపారు. అనంతరం హోటల్ భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులకు దిగారు. ఈమధ్యలోనే పేలుడు పదార్థాలు నింపిన కారును తీవ్రవాదులు పేల్చివేశారు.