పాకిస్థాన్‌లోని పెషావర్‌లో మానవబాంబుగా వచ్చిన ఓ వ్యక్తి స్థానిక పోలీస్ చెక్ పోస్టు వద్ద శుక్రవారం ఉదయం గ్రెనేడ్ విసిరి తనను తాను పేల్చుకున్నాడు. ఈ సంఘటనలో అక్కడే ఉన్న ఎనిమిది మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులను మట్టుబెట్టాలనే ఉద్దేశంతోనే ఈ దాడులు జరిగినట్లు సమాచారం. రెండురోజుల క్రితం ఇదే పట్టణంలోని ప్రముఖ పెర్ల్ కాంటినెంటల్ హోటల్‌లో జరిగిన బాంబు పేలుడులో 18మంది మృతి చెందారు. ఆ తర్వాత ఈ సంఘటన జరగడం పోలీసు వర్గాలను కలచివేసింది.
ఇదిలావుండగా తాలిబన్ తీవ్రవాదులకు వ్యతిరేకంగా సైనిక, పోలీసుల కార్యకలాపాలకు పెషావర్ ముఖ్యకేంద్రంగా ఉంది.
ఉగ్రవాదులను హతమార్చేందుకు పోలీసులు, సైనికులు పెషావర్ నుంచే తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు వారిపై ప్రతీకార చర్యగానే ఈ దాడులు చేసినట్లు సమాచారం.