ఆస్ట్ర్లేలియాలో భారతీయ విద్యార్థి కారుపై పెట్రోలు బాంబుతో అక్కడి దుండుగులు దాడులు చేశారు. తమ దేశంలో భారతీయ విద్యార్థులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు అన్ని రకాల చర్యలను చేపట్టనున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఓ వైపు చెపుతున్నాకూడా అక్కడ భారత విద్యార్థులపై దాడులు ఆగడం లేదు.
వివరాలలోకి వెళితే... తాజాగా భారతీయ విద్యార్థి కారును దుండుగులు ధ్వంసం చేశారు. మెల్‌బోర్న్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కోర్సు చదువుతున్న విక్రాంత్ రాజేష్ రతన్(22)కారును దుండుగులు తగులబెట్టారు. ఇతను పంజాబ్‌లోని లూధియానాకు చెందినవాడుగా సమాచారం.
రతన్ మాట్లాడుతూ... శనివారం రాత్రి అతని కారును గుర్తు తెలియని దుండుగులు కాల్చివేశారని, అలాగే మరో రెండు కార్లకుకూడా వారు నిప్పు పెట్టడం జరిగిందని ఆయన తెలిపారు. ఆ రెండు కార్లుకూడా భారతీయ విద్యార్థులకు చెందినవేనని ఆయన పేర్కొన్నారు.
తాము నిద్రపోతున్నప్పుడు ఈ సంఘటన జరిగిందని, కారులోని ఫైర్ అలారమ్ మ్రోగడంతో తాము మేల్కొన్నామని, ఈ లోపలే దుండుగులు క్కడినుంచి పారిపోయారని రతన్ వివరించారు. ఇది ఈ చుట్టుప్రక్కల నివసించేవారు ఇక్కడ మద్యం సేవిస్తుంటారని ఇది వారిపనే అయి వుంటుందని అతను అనుమానం వ్యక్తం చేశారు.
కాగా తొలుత కారు తలుపులు తెరిచేందుకు ప్రయత్నించి ఉంటారని, కాని తలుపులు తెరుచుకోకపోయేసరికి దుండుగులు పెట్రోలు బాంబులను కారుపై విసిరివుంటారని రతన్ పేర్కొన్నారు.