భారత దీర్ఘకాల, అతిపెద్ద మిలిటరీ భాగస్వామి రష్యా ఇప్పుడు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌తో భారత్ రక్షణ ఒప్పందం కుదుర్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ వ్యవహారంపై రష్యా గుర్రుగా ఉంది.
భారత రక్షణ శాఖ అధికారులు మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. రష్యా పర్యటనలో ఉన్న రక్షణ కార్యదర్శి విజయ్ సింగ్ నేతృత్వంలోని అధికార బృందం వద్ద ఈ ఒప్పందంపై ఆ దేశ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఉక్రెయిన్‌తో రక్షణ ఒప్పందం కుదుర్చుకోవడంపై రష్యా అభిప్రాయాన్ని భారత అధికార బృందం కోరింది. రక్షణ ఎగుమతుల వ్యాపారంలో, ముఖ్యంగా భారత్‌తో ఈ వ్యాపారంలో ఉక్రెయిన్‌ను రష్యా ప్రత్యర్థిగా భావిస్తోంది.
దీనికి తోడు భారత వైమానిక దళం మాజీ చీఫ్ ఫాలీ హోమీ మేజర్ తన పదవీ విరమణకు కొంతకాలం ముందు రష్యాకు చెందిన ఇల్ల్యూషిన్- 78 ట్యాంకర్లకు బదులుగా, ఏ330 బహుళ ప్రయోజనకర ట్యాంకర్ ట్రాన్స్‌పోర్ట్ (ఎంఆర్‌టీటీ) యుద్ధ విమానాలకు భారత్ మొగ్గుచూపుతుందని వ్యాఖ్యానించారు.
ఈ యుద్ధ విమానాలు గాలిలోనే ఇంధనం నింపుకునే సామర్థ్యాన్ని కలిగివుంటాయి. రష్యా ఇల్ల్యూషిన్- 78 యుద్ధ విమానాలు ఇప్పటికే భారత వైమానిక దళంలో ఆరు ఉన్నాయి. ఈ ప్రకటనపై రష్యా రక్షణ యంత్రాంగం అసంతృప్తితో ఉంది. అయితే ప్రభుత్వం దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకుందో లేదో మేజర్ వెల్లడించలేదు. ఆయన ఈ ప్రకటన మాత్రం దుమారం లేపింది.