భారత్ పర్యటనపై పౌరులకు అమెరికా హెచ్చరిక

భారత్ పర్యటనకు వెళ్లాలనుకుంటున్న అమెరికా పౌరులకు ఆ దేశ ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థ భారత్‌లో మరో తీవ్రవాద దాడికి కుట్రపన్నుతోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో అమెరికా ఈ హెచ్చరిక చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

తాజాగా వచ్చిన వార్తా కథనం ప్రకారం.. అమెరికా పరిపాలనా యంత్రాంగం భారత్ వెళ్లవద్దంటూ నేరుగా హెచ్చరికలు పంపనప్పటికీ, భారత పర్యటన విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. గత ఏడాది ముంబయి మహానగరంలో పాకిస్థాన్ తీవ్రవాద సంస్థలు పది మంది ఉగ్రవాదులతో దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.

ముంబయి ఉగ్రవాద దాడుల్లో 180 మందికిపైగా మృతి చెందారు. తాజాగా పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థ భారత్‌లో మరిన్ని దాడులు చేసేందుకు కుట్రపన్నుతోందని అమెరికా, భారత నిఘా సంస్థలు సమాచారాన్ని సేకరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా తమ ప్రయాణికులకు ముందస్తు హెచ్చరికలు చేసింది.

వెబ్దునియా పై చదవండి