సౌర కుటుంబానికి దూరంగా నక్షత్రమండలంలో అత్యంత నల్లని రంగుతో ఉన్న ఒక గ్రహాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. బృహస్పతి పరిమాణంలో ఉన్న ఈ గ్రహానికి టీఆర్‌ఈఎస్-2బిగా వారు పేరు పెట్టారు. ఈ గ్రహం నుంచి ఒక శాతం కంటే తక్కువ కాంతి వెలువడ వెలువడుతున్నట్టు కనుగొన్నారు. అందుకే ఇది నల్లగా బొగ్గు వలే కనిపిస్తోందని రాయల్ అస్ట్రోనామికల్ సొసైటీ పేర్కొంది.
ట్రాన్స్ అట్లాంటిక్ ఎక్సో ప్లానెట్ సర్వేలో భాగంగా నాసా అంతరిక్షనౌక కెప్లెర్ 2006లో ఈ టీఆర్‌ఈఎస్-2బి గ్రహాన్ని గుర్తించింది. ఈ నౌక పంపించిన చిత్రాలను హార్వర్డ్ స్మిత్స్‌సోనియన్ సెంటర్ ఫర్ ఆస్ట్రో ఫిజిక్స్‌కు చెందిన డేవిడ్ కిప్పింగ్ బృందం విశ్లేషించింది. అయితే, ఈ గ్రహం భూమికి 750 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని, జీఎస్‌సీ 03549- 02811 అనే నక్షత్రం చుట్టూ 5 మిలియన్ కిలోమీటర్ల దూరం నుంచి పరిభ్రమిస్తున్నట్టు వారు వెల్లడించారు.
గ్రహంపై నెలకొన్న అసాధారణ వాతావరణం కారణంగా ప్రకాశాన్ని శోషణం చేసుకొనే రసాయన మూలకాల అవిరులు పొటాషియం, వాయురూపంలోని టైటానియం ఆక్సైడ్‌లు భారీస్థాయిలో ఉన్నట్లు శాస్తవ్రేత్తల విశ్లేషణలో కనుగొన్నారు. అయితే ఈ గ్రహం నల్లగా కన్పించటానికి గల కారణాలపై శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు.