బ్రిటన్ ప్రధానమంత్రి గోర్డాన్ బ్రౌన్‌కు మంత్రివర్గ సహచరులు వరుసగా షాకులు ఇస్తున్నారు. తాజాగా మరో కేబినెట్ సహచరుడు రాజీనామా చేయడంతో గోర్డాన్ బ్రౌన్‌పై ఒత్తిడి మరింత పెరిగింది. బ్రిటన్ పనులు, ఫించన్ల శాఖ కార్యదర్శి జేమ్స్ పుర్నెల్ తన రాజీనామా లేఖను వార్తాపత్రికలకు పంపారు.
గోర్డాన్ బ్రౌన్ ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకోవడం ద్వారా ఎన్నికలకు వీలు కల్పించాలని రాజీనామా సందర్భంగా పుర్నెల్ సూచించారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో అధికార లేబర్ పార్టీ తిరిగి విజయం సాధించేందుకు బ్రౌన్ అవకాశం కల్పించాలన్నారు. గోర్డాన్ బ్రౌన్ నాయకత్వం కొనసాగించడం కన్జర్వేటివ్‌లు వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు దోహదపడుతుందని పుర్నెల్ తన లేఖలో పేర్కొన్నారు.
కన్జర్వేటివ్‌ల విజయం దేశానికి ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. గత మూడు రోజుల్లో బ్రిటన్ కేబినెట్ నుంచి తప్పుకున్ను మూడో వ్యక్తి పుర్నెల్ కావడం గమనార్హం. ఇంతకుముందు బ్రిటన్ హోంశాఖ కార్యదర్శి జాకీ స్మిత్, కమ్యూనిటీస్ కార్యదర్శి హజెల్ బ్లేర్స్‌లు కూడా రాజీనామాలు చేశారు.